తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా సాగుతున్నాయి. సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో భక్తులకు కోసం తరలి వచ్చిన స్వామికి ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవకోలాహలంగా జరిగింది.
సింహ వాహనం దర్శనంతోనే ధైర్యసిద్ధి
శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో దైర్యం, శక్తి, తేజస్సు వంటి శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.
శుక్రవారం ఉదయం సింహ వాహనసేవలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ జానపద నృత్యాలు, కళారూపాలకు అద్భుత వేదికగా నిలిచాయి. వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన వైవిధ్యమైన కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మొత్తం 9 రాష్ట్రాలకు చెందిన 20 బృందాలు, 557 మంది కళాకారులు పాల్గొని వాహనసేవ వైభవాన్ని మరింతగా పెంచారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణకు చెందిన గుస్సడీ నృత్యం, గుజరాత్‌కి చెందిన తిప్పని, మహారాష్ట్ర లవణి, ఆంధ్రప్రదేశ్ కళాకారులు భరతనాట్యం, నవదుర్గ, కూచిపూడి.. అస్సాం కి చెందిన కళాకారులు బిహు నృత్యం, ఒడిశాలోని సంపల్పురి నృత్యం, ఝార్ఖండ్ గౌరాసుర్.. కర్ణాటక వాసులచే శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం, పశ్చిమ బెంగాల్ కళాకారులవారు ఢాక్ నృత్యం.. మొదలైన కళా ప్రదర్శనలు భక్తులకు అపూర్వమైన అనుభూతిని కలిగించాయి.
సింహ వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, సివిఎస్వో మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు