
బెంగళూరులోని రాజాజీ నగర్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం తిరుమల శ్రీవారి మొక్కు తీర్చుకోకుండానే ప్రాణాలు విడిచింది. చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది. ఐదు మంది ఒకే ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. గురువారం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొనాల్సిన బెంగళూరుకు చెందిన మోహన్ దాస్, నాగరాజారావు కుటుంబాలకు చెందిన ఐదు మంది ఒకే కారులో తిరుమలకు బయలుదేరారు. ఉదయం బెంగళూరులోని రాజాజీ నగర్ లోని ఇంటి నుంచి బయలుదేరిన వారు ముల్బాగల్ వద్ద టిఫిన్ చేశారు. ఆ తరువాత తిరిగి ప్రయాణం ప్రారంభించి పలమనేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. వైయస్సార్ సర్కిల్ వద్ద హైవేపై వేగంగా వస్తూ వీరి కారు ముందు వెళుతున్న కంటైనర్‌ను ఢీ కొనింది. ఏకంగా కంటైనర్ వెనుక వైపు భాగంలోకి కారు ముందు భాగం చొచ్చుకుపోయింది. కంటైనర్ కింద ఇరుక్కుపోయిన కారును దాదాపు 500 మీటర్ల దాకా కంటైనర్ లాక్కెళ్ళింది. కారులోనే 5 మంది ఇరుక్కుపోయి మృతి చెందారు. ప్రమాదాన్ని స్థానికులు గుర్తించి కాపాడే ప్రయత్నం చేసే లోపే కారులోనే ఐదు మంది మృతిచెందినట్లు గుర్తించారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తిరుమలకు కారులో వెళుతూ ఒకే కుటుంబం ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు.
ప్రమాదంలో మృతి చెందిన వారు మోహన్ దాస్ (71) నాగరాజరావు (61) కుసుమ (61) జయంతి (59)పూజ(33)గా తెలుస్తోంది కంటైనర్‌ను కారు వెనుక వైపు నుంచి వేగంగా ఢీ కొన్నట్లు సిసి ఫుటేజ్ లో గుర్తించారు. డెడ్ బాడీలను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగరాజు రావు ఇండస్ట్రియల్ కామర్స్ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసినట్లు సమాచారం. మోహన్ దాస్ రాజాజీనగర్‌లో బిజినెస్ చేస్తున్నట్టు గుర్తించారు. నాగరాజు రావు భార్య జయంతి, మోహన్ దాస్ భార్య కుసుమ అక్కాచెల్లెళ్లు. కాగా ప్రమాదంలో మోహన్ దాస్ కుసుమ దంపతులు కూతురు 33 ఏళ్ల పూజ కూడా మృతి చెందింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రమాదంలో మృతి చెందడంతో పలమనేరు ఆసుపత్రిలో ఆర్తనాదాలు వినిపించాయి. బంధువులు స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..