Headlines

Tirumala: శ్రీవారికి ముడుపుల చెల్లింపు ఇకపై డిజిటల్ పేమెంటే.. త్వరలోనే అందుబాటులోకి..!

Tirumala: శ్రీవారికి ముడుపుల చెల్లింపు ఇకపై డిజిటల్ పేమెంటే.. త్వరలోనే అందుబాటులోకి..!


ఇప్పుడు అంతటా డిజిటల్ పేమెంటే.. రూ.5 వస్తువైనా సరే డిజిటల్ మోడ్‌లోనే చాలా మంది పేమెంట్ చేస్తున్నారు.. అందుకే ఇప్పుడు టిటిడి (తిరుమల తిరుపతి దేవస్థానం) కూడా వెంకన్నకు భక్తులు ముడుపులు సమర్పించేందుకు వీలుగా నగదు రహిత కానుకలను ప్రోత్సహించాలని భావిస్తుంది. హుండీలో నగదు రహిత కానుకలను సమర్పించేందుకు వీలుగా కసరత్తు చేస్తోంది. తిరుమల వెంకన్నకు హుండీ ద్వారా రోజు రూ.4 కోట్లకు తప్పకుండా ఆదాయం వస్తుంది. భక్తులు సమర్పించే కానుకలను లెక్కించేందుకు టీటీడీ పరకామణి ఏర్పాటు చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య హుండీ లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తోంది. అయితే భక్తులు సమర్పించే కానుకలను మరింత పారదర్శకంగా పొందేందుకు డిజిటల్ పేమెంట్స్ ను కూడా ప్రోత్సహిస్తుంది. ఈ మేరకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోబోతోంది.

తిరుమలేశుడికి మొక్కులో భాగంగా ముడుపులు చెల్లించే భక్తులు ఇకపై యూపీఐ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా ముడుపులు చెల్లించేందుకు ఏర్పాటు చేస్తోంది. తిరుపతి తిరుమలలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. వెంకన్న దర్శనం చేసుకునే భక్తులు హుండీలో సమర్పించే కానుకలు కావలసినంత నగదు రూపంలో లేదన్న ఇబ్బంది లేకుండా డిజిటల్ పేమెంట్ చేసేందుకు వీలు కల్పిస్తోంది. ఇప్పటిదాకా అధికారిక నిర్ణయం రాకపోయినా ఈనెల 28న జరిగే పాలకమండలి సమావేశంలో టీటీడీ ఈ నిర్ణయాన్ని తీసుకోబోతుందని సమాచారం..

డిజిటల్ పేమెంట్స్ తోపాటు.. టీటీడీ కొత్త విధానాన్ని తీసుకురానుంది. పెరిగిన డిజిటల్ చెల్లింపులకు అనుగుణంగా వెంకన్న హుండీలో కానుకలు సమర్పించేందుకు శ్రీవారి ముడుపు పత్రాన్ని ఇవ్వబోతుంది. ప్రత్యేక కౌంటర్లలో UPI ద్వారా చెల్లిస్తే చాలు భక్తులు శ్రీవారి హుండీకి కానుకలు సమర్పించినట్లుగా ముడుపు పత్రం ఇవ్వనుంది. ఇక ఏటా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య దాదాపు రెండున్నర కోట్లకు పైగా ఉంటుండగా 2025 ఏడాదిలో టీటీడీకి హుండీ ఆదాయం రూ 1383 కోట్ల మేర వచ్చింది.

ఇప్పటికే టీటీడీ నగదు రహిత లావాదీవీలను అమలు చేస్తుండగా ఇప్పుడు హుండీ లో సమర్పించే ముడుపులకు సైతం డిజిటల్ పేమెంట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్ణయం తీసుకోబోతుంది. రూ 100 నుంచి రూ. లక్ష దాకా డిజిటల్ పేమెంట్ చెల్లించేందుకు అవకాశం కల్పించబోతోంది. శ్రీవారి హుండీలో కానుకలు వేసి మొక్కు చెల్లించుకునే పని లేకుండా నేరుగా నగదు రహిత ముడుపులు స్వామివారికి చెల్లించే విధానం ఉపయోగపడనుందని టిటిడి భావిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *