Tirumala: నేడే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. మట్టికుండల్లో నవధాన్యాలు ఎందుకు నాటుతారో తెలుసా..

Tirumala: నేడే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. మట్టికుండల్లో నవధాన్యాలు ఎందుకు నాటుతారో తెలుసా..


తిరుమల శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్వామివారి సలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు రానేవచ్చేశాయి. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఈ బ్రహ్మోత్సవాలకు ఈ రోజు సాయంత్రం వేదం పండితులు అంకురార్పణ చేయనున్నారు. వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు రాత్రి 7గంటల నుంచి 8 గంటల మధ్యలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంతో ఈ బ్రహ్మోత్సవాలకు బీజం పడనుంది.

స్వామివారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు.

సేనాధిపతి ఉత్సవం: ఈ సందర్భంగా శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విష్వక్సేనులవారు ఈ విధంగా మాడ వీధుల్లో ఊరేగుతారని పురాణ ప్రాశస్త్యం.

ఇవి కూడా చదవండి

ముందుగా మేదినిపూజ: అంకురార్పణ సమయంలో వేసే నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదినిపూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు.

అంకురార్పణ: వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా మట్టికుండల్లో పుట్టమన్ను నింపుతారు. ఈ కుండల్లో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు.. అంటే సూర్యుడుకి సంకేతంగా గోధుమలు, చంద్రుడుకి సంకేతంగా బియ్యం , కుజుడుకి సంకేతంగా కందులు, బుధుడుకి సంకేతంగా పెసలు, బృహస్పతికి సంకేతంగా శనగలు, శుక్రుడుకి సంకేతంగా అలసందలు, శనీశ్వుడికి సంకేతంగా నువ్వులు, రాహువుకి మినుములు , కేతువుకు ఉలవలును పోస్తారు.ఇలా పోసిన నవధాన్య విత్తనాలు బాగా మొలకెత్తాలని.. సమస్త భూమండలం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఓషధీసూక్తాలను పఠిస్తారు. అంతేకాదు యాగశాలలో ఈ మట్టి కుండల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు.

అక్షతారోపణ: ఈ మట్టి కుండల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాలు జరిగీ తొమ్మిది పాటు పెంచుతారు. చివరిరోజున ఈ మొలలను వేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు. ఈ మొలకలు ఎంత గొప్పగా చిగురిస్తే బ్రహ్మోత్సవాలు అంత సంప్రదాయంగా.. ఘనంగా జరిగినట్లు భక్తుల విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *