తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. అలంకార ప్రియుడు వెంకన్నకు వెలకట్టలేని అభరణాలు ఎన్నో ఉన్నాయి. భక్తులు నిత్యం సమర్పించే కానుకలతో ఆయన సొత్తు కొండంతగా మారుతుంది. ఇందులో భాగంగానే శ్రీవారికి 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలు విరాళంగా ఇచ్చింది శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ రూ.1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను శ్రీవారికి బహుకరించారు.
శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పేష్కార్ రామకృష్ణకు స్వామీజీ ఈ కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బొక్కసం ఇన్ ఛార్జ్ గురురాజ్ స్వామితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారికి బంగారు వెండి కానుకలను సమర్పించిన మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీకి ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్య గమనిక
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.