
అమరావతి, అక్టోబర్ 23: రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద 66,57,508 మంది విద్యార్థులకు సాయం అందించినట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద లబ్ధిపొందిన విద్యార్థుల వివరాలపై శాసనమండలిలో యల్లారెడ్డిగారి శివరామిరెడ్డి, రాజగొల్ల రమేష్ యాదవ్, బొమ్మి ఇజ్రాయేల్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రత, పాఠశాల నిర్వహణ, విద్య, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కు విద్యార్థుల నుంచి తగ్గించిన రూ.2 వేలను వినియోగిస్తున్నామన్నారు.
వైసీపీ సభ్యులు అమ్మఒడి అని మాట్లాడుతున్నారు. అది అమ్మఒడి కాదు.. తల్లికి వందనం. ఎంతమంది విద్యార్థులు తల్లికి వందనం కింద లబ్ధిపొందారో ముందు వైసీపీ సభ్యులు స్పష్టత తెచ్చుకోవాలి. ఒక్కో సభ్యుడు ఒక్కో సంఖ్య చెబుతున్నారు. ఒకటో తరగతి విద్యార్థులకు అపార్ ఐడీ మంజూరు చేసిన తర్వాత తల్లికి వందనం అందజేస్తామని చెప్పాం. ఇంటర్ మొదటి ఏడాదిలో చేరిన తర్వాత పరిశీలించి నిధులు విడుదల చేస్తామని చెప్పాం. ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. సమస్యలు ఏమైనా ఉంటే వాట్సాప్ ద్వారా సంప్రదించాలని చెప్పామన్నారు.
వైసీపీ తీసుకువచ్చిన నిబంధనలనే అమలు చేశాం..
తల్లికి వందనం నిబంధనలు విషయానికి వస్తే.. గతంలో వైసీపీ పెట్టిన నిబంధనలనే తాము అమలుచేశామన్నారు. 300 యూనిట్లు, ఆప్కాస్ ఉద్యోగుల నిబంధన, భూమి నిబంధనలు పెట్టింది వైసీపీ. అర్హులందరికీ తల్లికి వందనం అందజేశాం. ఎస్సీ విద్యార్థులకు కేంద్రం కూడా నగదు అందజేస్తోంది. రెండింటిని జోడించి నగదు జమచేస్తాం. ఇందుకు కొంతసమయం పడుతుంది. వైసీపీ హయాంలో ఏడాదికి రూ.13వేలు ఇచ్చారు. అది కూడా చివరి ఏడాదిలో రూ.500 తగ్గించారు. వైసీపీ హయాంలో ఇచ్చింది నాలుగేళ్లు మాత్రమే. అర్హులందరికీ తల్లికి వందనం కింద ప్రతి ఏడాది సాయం అందిస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిజిటల్ రేషన్ కార్డులు కూడా మంజూరు చేశాం. ఎవరైనా అర్హులు ఉంటే తల్లికి వందనం తప్పకుండా వర్తింపజేస్తాం. ఆశావర్కర్లు, అంగన్ వాడీలకు కూడా తల్లికి వందనం పథకం వర్తింపు విషయాన్ని పరిశీలిస్తున్నాం. కేబినెట్ లో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం. పారిశుద్ధ్య కార్మికులకు ఇప్పటికే మినహాయింపు ఇచ్చామని మంత్రి లోకేష్ తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.