
హైదరాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 పోస్టుల తుది ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్ 2 పోస్టులకు సంబందించిన ధ్రువపత్రాల పరిశీలన పూర్తికాగా.. తుది జాబితా సిద్ధం చేస్తోంది. నిజానికి 3 నెలల క్రితమే ఈ ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. కానీ గ్రూప్ 1 పోస్టుల చుట్టూ నెలకొన్న న్యాయవివాదాల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైంది. కాగా మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులతో 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2024 డిసెంబరులో ఆఫ్‌లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించగా 2,49,964 మంది పరీక్షకు హాజరయ్యారు.
ఓఎంఆర్ పత్రాల్లో పొరపాట్లు, బబ్లింగ్ సరిగా చేయకపోవడం వంటి తదితర కారణాల వల్ల 13,315 మంది అభ్యర్థులను కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. మిగతా 2,36,649 మంది మార్కులతో జనరల్ ర్యాంకు లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ లిస్ట్‌ను ఈ ఏడాది మార్చి 11న విడుదల చేసింది. మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన వారికి 1:1 నిష్పత్తిలో మూడు దఫాలుగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. ఇక తుది ఫలితాల కోసం ఎప్పుడెప్పుడాని అభ్యర్ధులు ఎదురు చూస్తున్నారు.
గ్రూప్ 3 పోస్టులకు మోక్షం ఎప్పుడో?
గ్రూప్ 3 కింద భర్తీ చేయనున్న 1388 పోస్టులకు 2024 నవంబరులో రాత పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,67,921 మంది ఈ పోస్టులకు హాజరయ్యారు. సాంకేతిక కారణాల వల్ల 18,364 మందిని కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. మిగిలిన 2,49,557 మందితో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను మార్చి 14న వెల్లడించింది. మెరిట్ జాబితాలోని అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించేందుకు జూన్‌లో షెడ్యూలు ప్రకటించినప్పటికీ.. ఆ తర్వాత ఈ ప్రక్రియ వాయిదా వేసింది. గ్రూప్ 2 నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రూప్ 3 నియామకాలు పూర్తి చేయాలని కమిషన్ భావిస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.