హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న టీజీపీఎస్సీ గ్రూప్ 1 తుది ఫలితాలు ఎట్టకేలకు బుధవారం (సెప్టెంబర్ 24) అర్ధరాత్రి విడుదలయ్యాయి. మొత్తం 562 గ్రూప్ 1 సర్వీసు పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ (TGPSC) అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 563 పోస్టులకుగానూ 562 అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. న్యాయవివాదం నేపథ్యంలో మిగిలిన ఒక్క పోస్టును విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
టీజీపీఎస్సీ గ్రూప్ 1 తుది ఫలితాల 2025 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బుధవారం రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించడంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. దీంతో కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వడివడిగా ఫలితాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేశారు. హుటాహుటీన అదే రోజు అర్ధరాత్రి తుది ఎంపిక జాబితాను ప్రకటించారు. తుది ఎంపికలో మల్టీజోన్ 1లో 258 మంది, మల్టీజోన్ 2లో 304 మంది గ్రూప్ 1 పోస్టులక ఎంపికైనట్లు టీజీపీఎస్సీ పేర్కొంది.
ఇవి కూడా చదవండి
కాగా టీజీపీఎస్సీ గ్రూప్ 1 కింద మొత్తం 563 పోస్టులకు 2024 ఫిబ్రవరిలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మెయిన్స్ పరీక్షలు 2024 అక్టోబరు 21 నుంచి 27 వరకు నిర్వహించింది. మార్చి 30న మెయిన్స్ ఫలితాలు వెల్లడించింది. ఇందులో మొత్తం 21,085 మంది అభ్యర్థుల మార్కులను ప్రకటించింది. అయితే పరీక్ష పారదర్శకంగా జరగలేదని, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన సింగిల్ బెంచ్ జవాబు పత్రాల మూల్యాంకనం తిరిగి చేయాలని లేకుంటే మరోసారి పరీక్ష నిర్వహించాలంటూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై కమిషన్ డివిజనల్ బెంచ్‌లో సవాల్ చేయగా.. సింగిల్ జడ్జి తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితాల వెల్లడికి అనుమతి ఇవ్వడంతో కమిషన్ తుది ఫలితాలను వెల్లడించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.