Headlines

Terror Attack : తూటాల వర్షం.. రక్తం చిందిన మైదానం.. లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17 ఏళ్లు

Terror Attack : తూటాల వర్షం.. రక్తం చిందిన మైదానం.. లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17 ఏళ్లు


Terror Attack : క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ఒక బ్లాక్ డే మార్చి 3. సరిగ్గా 17 ఏళ్ల క్రితం (2009లో) పాకిస్థాన్ గడ్డపై శ్రీలంక క్రికెట్ జట్టుపై జరిగిన ఆ కిరాతక ఉగ్రదాడిని తలచుకుంటే ఇప్పటికీ క్రీడాలోకం ఉలిక్కిపడుతుంది. శాంతికి, స్నేహానికి చిహ్నంగా భావించే క్రీడా మైదానంలోకి మారణాయుధాలతో ఉగ్రవాదులు చొరబడటం ప్రపంచాన్నే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోరకలి జరిగిన నాటి నుంచి నేటితో (మార్చి 3, 2026) 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఒక్క ఘటన పాక్ క్రికెట్ ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మంటగలిపేసింది.

అది సరిగ్గా 2009వ సంవత్సరం.. శ్రీలంక జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ సాగుతోంది. మార్చి 3వ తేదీ ఉదయం, శ్రీలంక ఆటగాళ్లు తమ హోటల్ నుంచి బస్సులో స్టేడియానికి బయలుదేరారు. అంతా ప్రశాంతంగానే ఉందనుకుంటున్న సమయంలో, మాస్క్‌లు ధరించిన 12 మంది ఉగ్రవాదులు ఒక్కసారిగా బస్సుపై విరుచుకుపడ్డారు. వారి చేతుల్లో ఏకే-47 రైఫిళ్లు, రాకెట్ లాంచర్లు, హ్యాండ్ గ్రెనేడ్లు ఉన్నాయి. బస్సును లక్ష్యంగా చేసుకుని తూటాల వర్షం కురిపించారు. ఆ సమయంలో బస్సు లోపల ఉన్న లంక ఆటగాళ్లు ప్రాణ భయంతో సీట్ల కింద దాక్కున్నారు.

ఆ క్లిష్ట పరిస్థితుల్లో బస్సు డ్రైవర్ మొహమ్మద్ ఖలీల్ చూపిన సాహసం అద్భుతం. ఉగ్రవాదులు టైర్లపై కాల్పులు జరుపుతున్నా, తూటాలు దూసుకొస్తున్నా ఏమాత్రం భయపడకుండా బస్సును వేగంగా స్టేడియం లోపలికి తీసుకెళ్లి గేట్లు వేయించాడు. లేదంటే ఆ రోజు శ్రీలంక జట్టులో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలేవారు కాదేమో.. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు, ఇద్దరు సామాన్యులు ప్రాణాలు కోల్పోగా.. లంక దిగ్గజ ఆటగాళ్లు కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, తిలాన్ సమరవీర, అజంతా మెండిస్, సురంగ లక్మల్ తీవ్రంగా గాయపడ్డారు. సమరవీర కాలిలోకి తూటా దూసుకుపోవడంతో పరిస్థితి విషమంగా మారింది.

ఈ ఘటన తర్వాత మ్యాచ్‌ను వెంటనే రద్దు చేసి, శ్రీలంక ఆటగాళ్లను హెలికాప్టర్ ద్వారా అక్కడి నుంచి తరలించారు. ఈ దాడితో పాకిస్థాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ దేశాలు రెడ్ కార్డ్ చూపించాయి. దాదాపు పదేళ్ల పాటు ఏ జట్టు కూడా పాకిస్థాన్‌లో అడుగు పెట్టడానికి సాహసించలేదు. పాక్ తన సొంత మ్యాచులను యూఏఈ వేదికగా ఆడుకోవాల్సి వచ్చింది. భారత్ అయితే 2008 నుంచి ఇప్పటివరకు పాక్ గడ్డపై ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికీ టీమిండియా అక్కడికి వెళ్లడానికి నిరాకరిస్తూనే ఉంది. ఆ రోజు జరిగిన ఉగ్ర విలయం పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఒక తీరని మచ్చగా మిగిలిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *