
శిశు విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఈ అమ్మకాలు ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా మెదక్ జిల్లాలో అమానుషం వెలుగులోకి వచ్చింది. మద్యం సేవించేందుకు డబ్బులు లేవని కన్న కొడుకును అమ్మకానికి పెట్టింది ఓ తల్లి. పోలీసులకు అంగన్వాడీ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బహిర్గతమైంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పలువురు మధ్యవర్తులను అదుపులోకి తీసుకుని, శిశువును రక్షించారు.
మెదక్లో జిల్లా హవేలీ ఘనపూర్ మండలం లింగసానిపల్లి తాండాకు చెందిన మంజుల ఈ దారుణానికి ఒడిగట్టింది. మాత శిశు సంరక్షణ కేంద్రంలో ఫిబ్రవరి 10వ తేదీన మగ శిశువుకు జన్మనిచ్చింది మంజుల. తాగుడుకు బానిసైన మంజుల డబ్బుల కోసం శిశువును విక్రయానికి పెట్టింది. వారం రోజుల మగ శిశువును తన ప్రియుడితో కలిసి విక్రయించింది కసాయి తల్లి. కామారెడ్డికి చెందిన దంపతులకు లక్షా 70 వేల రూపాయలకు మగబిడ్డను విక్రయించింది.
అయితే బాలింతకి ఇచ్చే గుడ్లు, ఆహారం తీసుకోవడానికి ఎవరు రాకపోవడంతో అంగన్వాడీ టీచర్ మంజుల ఇంటికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. తల్లి ఒడిలో ఉండాల్సిన బిడ్డ కనిపించకపోవడంతో ICDS అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చింది అంగన్వాడీ టీచర్. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి శిశువును రక్షించారు. శిశువుతో పాటు తల్లిని సఖి కేంద్రానికి తరలించారు ICDS అధికారులు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆసక్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మహిపాల్ అనే వ్యక్తితో మంజుల కలిసి ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి మంజులతో సహజీవనం చేస్తున్నట్లు తేలింది. ఇద్దరు మద్యానికి బానిసలుగా మారి, సంపాదన లేక శిశువును అమ్మకానికి పెట్టారు. అంగన్వాడి టీచర్ అప్రమత్తతతో వీళ్ల బండారం బయటపడింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…