Telangana: వైన్స్ షాప్ టెండర్స్‌కు తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?

Telangana: వైన్స్ షాప్ టెండర్స్‌కు తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?


తెలంగాణలో కొత్త వైన్స్ షాప్స్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు దుకాణాల కేటాయింపునకు సంబంధించి టెండర్ ప్రక్రియ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం(సెప్టెంబర్ 26) నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిన కొత్త వైన్స్ షాపులను కేటాయించనున్నారు. కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితిగా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజును గతం కంటే లక్ష రూపాయలను పెంచుతూ.. రూ.3లక్షలుగా నిర్ణయించారు. దుకాణాల కేటాయింపులో కులాల వారీగా రిజర్వేషన్లు కల్పించారు. గౌడ్ లకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. జిల్లా కలెక్టర్ల సమక్షంలో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు.

2011జనాభా లెక్కల ప్రకారం మద్యం షాపుల లైసెన్స్ ఫీజులను నిర్ధారించారు. 5వేల జనాభా కలిగిన గ్రామాలకు 50లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. 5000 నుంచి 50వేల జనాభా కలిగిన ప్రాంతాలకు రూ.55లక్షలు, 50వేల నుంచి 1లక్ష జనాభా వరకు రూ. 60లక్షలు, 1లక్ష నుంచి 5లక్షల వరకు జనాభాకు కలిగిన ఏరియాలకు రూ.65లక్షలు, 5లక్షల నుంచి 20లక్షల జనాభాకు రూ.85లక్షలు, 20లక్షల పైచిలుకు జనాభా కలిగిన ప్రాంతంలోని వైన్స్ షాపులకు రూ.1కోటి 10లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆరు విడతలుగా చెల్లించే అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,620 రిటైల్ అవుట్‌లెట్‌లకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ పేర్కొంది.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందుగానే కొత్త వైన్స్ షాప్ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దుకాణాలను లాటరీ పద్దతి ద్వారా కేటాయించనున్నారు. ప్రస్తుతం 2023-25 దుకాణాల లైసెన్స్‌ గడువు ఈ ఏడాది నవంబరు 30తో ముగియనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ4 వైన్ షాపులు 2,620 వరకు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 690 మద్యం దుకాణాలున్నాయి. కేవలం వైన్స్ షాపు దరఖాస్తుల ద్వారానే రూ.3,500 కోట్ల మేర ఆదాయం వస్తుందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఉన్న రూ.2లక్షల దరఖాస్తు ఫీజును రూ.3లక్షలకు పెంచారు. కొత్త మద్యం పాలసీ అమలు చేస్తే.. కేవలం 30 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజుల ద్వారా 30 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *