Telangana: రైతులకు ఇది కదా కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

Telangana: రైతులకు ఇది కదా కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..


తెలంగాణ వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. సాగును ఆధునీకరించడం, రైతులకు కూలీల ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా భారీ సబ్సిడీతో వ్యవసాయ డ్రోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణను వెల్లడించారు. పంటలకు పురుగుమందులు, సూక్ష్మ పోషకాలను పిచికారీ చేసేందుకు డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో డ్రోన్‌పై 40 శాతం సబ్సిడీ లేదా గరిష్టంగా రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీలు మరియు మహిళా రైతులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఉంటుంది. తొలి దశలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు 10 డ్రోన్ల చొప్పున పంపిణీ చేయనున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ప్రాథమిక సహకార సంఘాలకు వీటిని కేటాయిస్తారు.

డ్రోన్ల వల్ల రైతులకు కలిగే లాభాలు

వ్యవసాయంలో డ్రోన్ల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను మంత్రి వివరించారు. పిచికారీ చేసే సమయం దాదాపు 70 నుండి 80శాతం వరకు తగ్గుతుందని తెలిపారు. కూలీల కొరత సమస్య తీరడమే కాకుండా ఖర్చు కూడా భారీగా తగ్గుతుందన్నారు. ఎరువులు, మందులు పంట అంతటా సమానంగా అందండంతో దిగుబడి పెరుగుతుందని చెప్పారు. కేవలం డ్రోన్లు మాత్రమే కాకుండా వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మరిన్ని పరికరాలను ప్రభుత్వం అందిస్తోంది. పసుపు ఉడకబెట్టే, పాలిషింగ్ చేసే యంత్రాలు, గెలలు కోయడానికి ఉపయోగపడే టెలిస్కోపిక్ హార్వెస్టింగ్ పోల్స్ వంటివి అందించనున్నారు. 2025-26లో ఇప్పటివరకు 9,936 యంత్రాలను పంపిణీ చేయగా, ప్రభుత్వం రూ. 28.74 కోట్ల సబ్సిడీని నేరుగా రైతులకు అందించింది.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, సబ్సిడీ శాతం, అప్లికేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఆయా జిల్లాల వ్యవసాయ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. రాబోయే 10 నుండి 15 రోజుల్లో మిగిలిన వ్యవసాయ పరికరాలను కూడా రైతులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా సాంకేతికతను సామాన్య రైతుకు చేరువ చేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *