తెలంగాణ గట్టు మీద ఎన్నోరోజులు వేచిచూసిన సందర్భం రానేవచ్చింది. స్థానిక సంస్థల్లో యుద్ధానికి తెరలేచింది. గ్రామపంచాయతీలతోపాటు, MPTC, ZPTCల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో పెద్దపండగ తర్వాత పెద్ద రాజకీయ సమరానికి ముమూర్తం ఖరారు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ను రాష్ట్ర ఎన్కికల సంఘం ప్రకటించింది. ఈ క్షణం నుంచే ఎన్నికల నిబంధనలు అమలులోకి వస్తాయని ఎన్నికల ప్రధానాధికారి రాణి కుముదిని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.-మొత్తం గ్రామ పంచాయితీలు 12,733లకు గానూ 1,12, 288 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి స్థాయి షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే, మూఢు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో మూడు విడతలుగా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ఈమేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఎస్ఈసీ రాణికుముదిని తెలిపారు.