ములుగు జిల్లా జేడీ మల్లంపల్లి గ్రామానికి చెందిన మౌనిక జీవితం చిన్నప్పటి నుంచి కష్టాలతోనే సాగింది. కూలీ పనులు చేసే తల్లి సరోజ, చిన్న పంక్చర్ షాపుతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన తండ్రి సమ్మయ్య.. ఇద్దరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించేవారు. ఆర్థిక పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా.. వారు కూతురు చదువును మాత్రం ఆపలేదు. వారి త్యాగాలు, కలలని చూసి మౌనిక ప్రభుత్వ కొలువు సంపాదించి.. తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలని చిన్నప్పుడే నిర్ణయించుకుంది.
2020లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. ఆ తర్వాత పూర్తిగా ఉద్యోగ సాధనపై ఫోకస్ పెట్టింది. కోచింగ్ సెంటర్లకు భారీ ఫీజులు కట్టే పరిస్థితి లేకపోవడంతో.. ఇంట్లోనే తన ప్రిపరేషన్ కొనసాగించింది. గ్రూప్-1 పరీక్షల కోసం రోజుకు 12 గంటలకుపైగా క్రమశిక్షణతో చదివింది. క్రమం తప్పకుండా టెస్ట్ పేపర్లు రాసి.. తన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగింది. కష్టాలు ఎన్ని వచ్చినా, లక్ష్యాన్ని వదల్లేదు.
ఆ పట్టుదల ఫలించింది. తాజాగా విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో మౌనిక 315వ ర్యాంక్ సాధించింది. ఈ ర్యాంక్ ద్వారా ఆమె డీఎస్పీగా ఎంపికైంది. తల్లిదండ్రులు ఒకప్పుడు చెమటోడ్చి నడిపిన పంక్చర్ షాపు ముందు, ఈరోజు డీఎస్పీగా నిలబడ్డ కూతురి విజయాన్ని చూసి వారి కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి.
మౌనిక గెలుపు కేవలం వ్యక్తిగత విజయమే కాదు.. అనేక పేద, మధ్యతరగతి యువతకు స్ఫూర్తి. శ్రమను ఆయుధంగా మార్చుకుంటే విజయమే నీ సొంతం అవుతుంది అని తన జీవితం ద్వారా నిరూపించింది మౌనిక. గ్రామమంతా ఆమెను అభినందిస్తారు. అందరూ గొప్ప కూతుర్ని కన్నారు అంటుంటే మౌనిక తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.

Mounika
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి