Team India : 3 గంటల గ్రహణం.. 1 గంట ఆలస్యం.. టీమిండియా ప్రాక్టీస్ పై చంద్రగ్రహణం ఎఫెక్ట్

Team India : 3 గంటల గ్రహణం.. 1 గంట ఆలస్యం.. టీమిండియా ప్రాక్టీస్ పై చంద్రగ్రహణం ఎఫెక్ట్


Team India : టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్ సమరానికి ముంబైలోని వాంఖడే స్టేడియం సర్వం సిద్ధమైంది. మార్చి 5న భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం టీమిండియా ఇప్పటికే ముంబై చేరుకుంది. అయితే మంగళవారం (మార్చి 3) జరిగిన టీమిండియా తొలి ప్రాక్టీస్ సెషన్‌పై చంద్రగ్రహణం ప్రభావం చూపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గ్రహణం కారణంగా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ప్రాక్టీస్ ఆలస్యంగా ప్రారంభమైంది. మైదానంలోకి ఆటగాళ్లు అడుగుపెట్టడానికి ముందే గ్రహణం వీడాల్సి రావడంతో గంటన్నరకు పైగా సమయం వృధా అయ్యింది.

నిజానికి వాంఖడే స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరగాల్సి ఉంది. కానీ, సాయంత్రం 7 గంటల 20 నిమిషాల వరకు ఒక్క భారత ఆటగాడు కూడా గ్రౌండ్‌లోకి రాలేదు. స్టేడియం లైట్లు కూడా సాయంత్రం 6:50 గంటల వరకు ఆన్ చేయలేదు. చంద్రగ్రహణం సాయంత్రం 6:47 గంటలకు ముగియడంతో, ఆ తర్వాతే స్టేడియం సిబ్బంది లైట్లు వేయడం ప్రారంభించారు. టీమిండియా సభ్యులందరూ మైదానంలోకి వచ్చిన తర్వాతే పూర్తిస్థాయిలో లైట్లను ఆన్ చేశారు. మధ్యాహ్నం 3:21 గంటలకు ప్రారంభమైన ఈ చంద్రగ్రహణం సుమారు 3 గంటల 27 నిమిషాల పాటు కొనసాగింది.

ఈ ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. భారత ఆటగాళ్లందరూ టీమ్ బస్సులో హోటల్ నుంచి స్టేడియానికి చేరుకోగా, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం విడిగా తన సొంత కారులో మైదానానికి వచ్చాడు. కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ అందరికంటే ముందే గ్రౌండ్‌కు చేరుకున్నప్పటికీ, గ్రహణం ప్రభావం వల్ల ప్రాక్టీస్ నెట్స్ సిద్ధం చేయడానికి సమయం పట్టింది. సూర్యకుమార్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌ను ఢీకొట్టేందుకు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయింది.

ప్రస్తుత వరల్డ్ కప్‌లో వాంఖడే స్టేడియంలో భారత్‌కు ఇది రెండో మ్యాచ్. ఇంతకుముందు ఇదే మైదానంలో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టుకు ఇది వాంఖడేలో మూడో మ్యాచ్ కానుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ ఇక్కడ ఒకదాంట్లో అతి కష్టం మీద గెలవగా, మరో మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో లోకల్ కండిషన్స్ భారత్‌కు కలిసివస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. గ్రహణం వీడిన తర్వాత మొదలైన ఈ ప్రాక్టీస్ సెషన్ టీమిండియాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గురువారం జరిగే అసలైన పోరులో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి భారత్ ఫైనల్ చేరుతుందా లేదా అనేది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *