T20 World Cup 2026 : స్కిల్ మీటర్ కామెడీ..మిల్లర్ కన్నా తిలక్ వర్మ పవర్ ఎక్కువట..బ్రాడ్‌కాస్టర్లపై ఫ్యాన్స్ ఫైర్

T20 World Cup 2026 : స్కిల్ మీటర్ కామెడీ..మిల్లర్ కన్నా తిలక్ వర్మ పవర్ ఎక్కువట..బ్రాడ్‌కాస్టర్లపై ఫ్యాన్స్ ఫైర్


T20 World Cup 2026 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 సమరంలో భారత్ ఓటమి కంటే, బ్రాడ్‌కాస్టర్లు చూపించిన ఒక వింత ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్‌ను ముంచేశాడు. అయితే మ్యాచ్ మధ్యలో బ్రాడ్‌కాస్టర్లు వాడే స్కిల్ మీటర్ ఆటగాళ్ల పవర్ హిట్టింగ్ కెపాసిటీ పోలుస్తూ చూపిన రేటింగ్స్ చూసి క్రికెట్ అభిమానులు నోరెళ్ల బెడుతున్నారు. అసలు ఆ మీటర్ ఎలా పనిచేస్తుందో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. పవర్ హిట్టింగ్‌లో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లలో ఒకడైన డేవిడ్ మిల్లర్‌కు ఈ స్కిల్ మీటర్ కేవలం 64 పాయింట్లు మాత్రమే ఇచ్చింది. అదే సమయంలో భారత యువ ఆటగాడు తిలక్ వర్మకు ఏకంగా 97 పాయింట్లు కేటాయించింది. ఈ పోలిక చూసిన నెటిజన్లు బ్రాడ్‌కాస్టర్లపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. ఈ మ్యాచ్‌లోనే మిల్లర్ 35 బంతుల్లో 63 పరుగులు చేసి (7 ఫోర్లు, 3 సిక్సర్లు) తన పవర్ ఏంటో చూపించాడు. మరోవైపు తిలక్ వర్మ కేవలం 1 పరుగుకే అవుట్ అయ్యాడు. ఈ వరల్డ్ కప్‌లో తిలక్ ఫామ్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో కలిపి అతను 107 పరుగులు మాత్రమే చేశాడు, సగటు 21.40 కాగా స్ట్రైక్ రేట్ కేవలం 118గా ఉంది. ఇంత తక్కువ గణాంకాలు ఉన్న ఆటగాడికి, మిల్లర్ కంటే ఎక్కువ పవర్ హిట్టింగ్ పాయింట్లు ఎలా ఇస్తారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

కేవలం మిల్లర్ విషయంలోనే కాదు, వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ రోవ్‌మన్ పావెల్ విషయంలోనూ ఇలాంటి వింతే జరిగింది. జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో పావెల్ 35 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో అతను ఏకంగా 106 మీటర్ల భారీ సిక్సర్‌ను కూడా బాదాడు. కానీ స్కిల్ మీటర్ మాత్రం పావెల్‌కు కేవలం 94 పాయింట్లు ఇచ్చింది. అంటే 100 మీటర్ల పైగా సిక్సర్లు కొట్టే పావెల్ కంటే, తిలక్ వర్మ పవర్ హిట్టింగ్ స్కిల్స్ ఎక్కువని ఆ మీటర్ చెప్పకనే చెప్పింది. ఈ విడ్డూరాన్ని చూసిన క్రికెట్ ప్రేమికులు ఇది స్కిల్ మీటరా లేక కామెడీ మీటరా? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

అసలు ఈ పవర్ హిట్టింగ్ పాయింట్లను ఏ ప్రాతిపదికన లెక్కిస్తారనే దానిపై బ్రాడ్‌కాస్టర్ల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. సాధారణంగా స్ట్రైక్ రేట్, సిక్సర్లు బాదే కెపాసిటీ, బంతిని ఎంత వేగంగా హిట్ చేస్తున్నారు అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో అదరగొడుతున్న మిల్లర్, పావెల్ వంటి దిగ్గజాలకు తక్కువ పాయింట్లు ఇచ్చి, ఫామ్ కోసం కష్టపడుతున్న యువ ఆటగాళ్లకు అధిక రేటింగ్ ఇవ్వడం సాంకేతిక లోపమా లేక విశ్లేషణ లోపమా అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. టీ20 క్రికెట్‌లో డేవిడ్ మిల్లర్ లాంటి కిల్లర్ ఆటగాడిని అవమానించడమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ స్కిల్ మీటర్ వివాదం వరల్డ్ కప్ వేడిని మరింత పెంచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *