T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా అద్భుత ప్రదర్శన వెనుక కారణం అదేనట..మొత్తానికి బయటపెట్టాడుగా

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా అద్భుత ప్రదర్శన వెనుక కారణం అదేనట..మొత్తానికి బయటపెట్టాడుగా


T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో సౌతాఫ్రికా జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. మైదానంలో పక్కా ప్లానింగ్‌తో దిగుతున్న ప్రోటీస్ పడగ విప్పిన పాములా ప్రత్యర్థులపై విరుచుకుపడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ జట్టు, గత రెండేళ్లలో రెండోసారి సెమీఫైనల్‌లో తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. కేవలం బ్యాటర్లే కాకుండా, బౌలర్లు కూడా సమష్టిగా రాణిస్తుండటమే ఈ విజయాల రహస్యం. ముఖ్యంగా వెస్టిండీస్‌పై సాధించిన భారీ విజయం సౌతాఫ్రికాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఈ టోర్నీలో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కాగిసో రబాడా తన స్థాయికి తగ్గట్టుగా వికెట్లు తీయలేకపోయినప్పటికీ, జట్టు గెలుస్తుండటంపై అతను చాలా సంతృప్తిగా ఉన్నాడు. విండీస్‌పై విజయం తర్వాత రబాడా మాట్లాడుతూ.. క్రికెట్‌లో వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రదర్శనే ముఖ్యమని స్పష్టం చేశాడు. ఈ టోర్నీలో అతను ఇప్పటివరకు 4 వికెట్లు మాత్రమే తీసినప్పటికీ, తన బౌలింగ్‌లో ఫీల్డర్లు పలు క్యాచ్‌లను వదిలేయడం వల్ల వికెట్ల సంఖ్య తగ్గిందని అతను అభిప్రాయపడ్డాడు. అయితే, ఇలాంటివి ఆటలో భాగమేనని, అదృష్టం ఎప్పుడూ ఒకేలా ఉండదని అతను చాలా కూల్‌గా సమాధానమిచ్చాడు.

సౌతాఫ్రికా జట్టులో ప్రస్తుతం అనుభవం, యువ రక్తం సరిగ్గా కలగలిసి ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ తన అద్భుత బ్యాటింగ్‌తో గెలిపిస్తే, మరో మ్యాచ్‌లో కెప్టెన్ ఎయిడెన్ మార్క్రామ్ తన నాయకత్వ పటిమను చాటుతున్నాడు. బౌలింగ్‌లో మార్కో జాన్సెన్, లుంగీ ఎన్గిడి కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నారు. జట్టులోని ఆటగాళ్ల ఆత్మవిశ్వాసమే తమ అతిపెద్ద బలమని, వరల్డ్ కప్‌కు ముందు జరిగిన SA20 లీగ్ కూడా ఆటగాళ్లు ఫామ్‌లోకి రావడానికి ఎంతో దోహదపడిందని రబాడా పేర్కొన్నాడు.

ప్రస్తుత సౌతాఫ్రికా బౌలింగ్ విభాగంలో ఎంతో వైవిధ్యం ఉంది. పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా బౌలర్లను మార్చడం ప్రత్యర్థి జట్లకు సవాల్‌గా మారుతోంది. రబాడా తన తోటి బౌలర్ లుంగీ ఎన్గిడిని ప్రత్యేకంగా ప్రశంసించాడు. గత కొన్నేళ్లుగా ఎన్గిడి నిలకడగా రాణిస్తూ జట్టు బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేస్తున్నాడని చెప్పాడు. మరి ఇదే జోరును సెమీఫైనల్‌లో కూడా కొనసాగించి, ఏళ్లనాటి వరల్డ్ కప్ కలను సౌతాఫ్రికా నిజం చేసుకుంటుందో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *