తెలుగు రాష్ట్రాల నుంచి తరచూ వేల మంది భక్తులు శ్రీశైలం శ్రీమల్లిఖార్జునస్వామివారిని దర్శించుకునుందుకు వెళ్తుంటారు. దీంతో నిరంతరం భక్తుల రద్దీతో శ్రీశైలం ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో శ్రీశైలం దర్శనాలకు సంబంధించిన ప్రతీ విషయం గురించి భక్తులు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ నెలలో ఉగాది వస్తుండటం, పండుగ సెలవులు రానుండటంతో శ్రీశైలం వెళ్లేందుకు చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఉగాది సందర్భంగా శ్రీశైలంలో ఉత్సవాలు జరిపేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో భక్తుల రద్దీ ఏర్పడే అవకాశముండటంతో ఆలయ నిర్వాహకులు ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
5 రోజుల పాటు ఈ దర్శనాలు బంద్
ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైలంలో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు స్పర్శ దర్శనాలు బంద్ చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని పాలకమండలి ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. కేవలం ఈ ఐదు రోజుల పాటు భక్తులకు అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని, స్పర్శ దర్శనం అవకాశం అందుబాటులో ఉండదని తెలిపారు. మార్చి 6 నుంచి 15వ తేదీ వరకు నాలుగు విడతలుగా ఆన్ లైన్‌లో భక్తులకు టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రతీ స్లాటుకు 1500 టికెట్ల కరెంట్ బుకింగ్, ఆన్‌లైన్‌లో 500 టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు ఈ విషయాలను తెలుసుకోవాలని సూచించారు. శ్రీశైలంలోని పారిపాలన భవనంలో ఉగాది ఉత్సవాలు, దర్శన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నేటి నుంచి పాదయాత్ర భక్తులకు అనుమతి
సోమవారం నుంచి పాదయాత్ర భక్తులకు అనుమతి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఇక భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం 5 లక్షల వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉంచామని, వీటిని భక్తులకు అందిస్తామని అన్నారు. ఇక పాదయాత్ర, పార్కింగ్ ఏరియాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఉగాది ఉత్సవాలను విజయవంతం చేస్తామన్నారు. ఈ సారి ఉగాదికి 7 లక్షల మంది భక్తులు శ్రీశైలంకు వస్తారని అంచనా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అటు మార్చి 3న చంద్రగ్రహణం సందర్బంగా శ్రీశైలం ఆలయం మూసివేయనున్నారు. భక్తులకు దర్శనాలను బంద్ చేయనున్నారు. చంద్రగ్రహణం ముగిసిన అనంతరం శుద్ది కార్యక్రమాలు నిర్వహించి ఆలయం తెరవనున్నారు.