ఉదయం నిద్రలేవగానే కప్పు వేడి వేడి టీ తాగందే దాదాపు ఎవ్వరికీ రోజు ప్రారంభం కాదు. మనలో చాలా మంది దీనిని అమితంగా ఇష్టపడతారు. కానీ మీరు రోజు మొత్తంలో ఎంత టీ తాగుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఎక్కువ టీ తాగడం వల్ల మీ శరీరంపై చెడు ప్రభావాలు ఉంటాయి.
టీ ప్రియులు రోజుకు రెండు మూడు సార్లు టీ తాగితే ఇబ్బంది ఏం లేదు. కానీ కొన్నిసార్లు ఈ టీ తాగే అలవాటు మిమ్మల్ని లేనిపోని ఇబ్బందుల్లో పడేస్తుంది. ముఖ్యంగాఅతిగా టీ తాగడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
టీని మితంగా తాగడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మిమ్మల్ని బద్ధకం నుంచి కాపాడుతాయి. కానీ కొంతమందికి ప్రతి రెండు నుంచి మూడు గంటలకు టీ తాగాలని అనిపిస్తుంది. దీంతో వీరు రోజుకు ఎంత టీ తాగుతారో లెక్క ఉండదు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక రోజులో 200 నుంచి 300 mg కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోకూడదు. మీరు రోజుకు ఐదు నుంచి ఆరు కప్పుల టీ తాగితే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ టీ తాగడం వల్ల మీ శరీరంలో కెఫిన్ పరిమాణం పెరుగుతుంది. ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది. నిద్రలేమి వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది.
టీ ఎక్కువగా తాగడం వల్ల అసిడిటీ, కడుపు నొప్పి, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. టీ ఎక్కువగా తాగడం వల్ల రక్తహీనత కూడా వస్తుంది. అందుకే మీరు ఎంత టీ తాగుతారనే విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.




