
దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ ఫైనాన్షియల్ ఫ్రాడ్‌లు కూడా వేగంగా పెరుగుతున్నాయి. బ్యాంకింగ్, UPI, క్రెడిట్ కార్డు మోసాల ద్వారా సాధారణ ప్రజల డబ్బు దోచుకునే ఘటనలు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిపుణుల ప్రకారం.. వ్యక్తిగత సమాచారం రహస్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. OTP, CVV, పిన్, నెట్‌బ్యాంకింగ్ పాస్‌వర్డ్ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. బ్యాంకులు లేదా అధికార సంస్థలు ఎప్పుడూ ఫోన్‌లో ఈ వివరాలు అడగవని గుర్తుంచుకోవాలి. అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తే వెంటనే నిర్లక్ష్యం చేయడం ఉత్తమం.
ఫిషింగ్ లింకులు పెద్ద ప్రమాదంగా మారుతున్నాయి. బహుమతులు, క్యాష్‌బ్యాక్‌లు లేదా KYC అప్‌డేట్ పేరుతో వచ్చే లింకులను క్లిక్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారానే సేవలు వినియోగించాలి. అదనంగా మొబైల్‌లో యాంటీవైరస్, అధికారిక యాప్‌లనే ఉపయోగించడం సురక్షిత పద్ధతి. UPI ఉపయోగించే వారు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు స్వీకరించేందుకు కలెక్ట్ రిక్వెస్ట్ కు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి. పిన్ ఎంటర్ చేస్తే డబ్బు డెబిట్ అవుతుంది. అలాగే స్క్రీన్ షేర్ యాప్‌లు డౌన్‌లోడ్ చేయమని ఎవరైనా చెప్పితే వెంటనే తిరస్కరించాలి.
ఏదైనా మోసం జరిగినట్లు అనుమానం వచ్చిన వెంటనే బ్యాంకును సమాచారం ఇవ్వాలి. అలాగే 1930 హెల్ప్‌లైన్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ఆర్థిక నష్టానికి దారితీసే అవకాశం ఉన్నందున డిజిటల్ లావాదేవీల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండటం అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి