
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన దుప్పి కుక్కల దాడిలో మృతి చెందింది. ఈ ఘటన పట్టణంలోని పాలకేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. పాలకేంద్రానికి అతి సమీపంలోనే నీలాద్రి అర్బన్ పార్క్ ఉంది. అక్కడి నుంచి బయటకు వచ్చిన దుప్పి రహదారులపై తిరుగుతుండగా, వీధికుక్కలు గమనించాయి. ఒక్కసారిగా దాని మీద పడి దాడి చేయడంతో దుప్పి తీవ్రంగా గాయపడింది. స్థానికులు అటవీ శాఖకు సమాచారం అందించగా, అధికారులు అక్కడికి చేరుకొని మృతి చెందిన దుప్పిని తరలించారు.
ఇక ఇదే తరహా ఘటన శనివారం సింగరేణి సమీపంలోనూ జరిగింది. అక్కడ కుక్కల దాడిలో మరొక దుప్పి తీవ్రంగా గాయపడింది. దానిని స్థానికులు రక్షించి సింగరేణి అధికారులకు అప్పగించారు. అయితే, కొద్ది గంటల్లోనే ఆ దుప్పి కూడా గాయాల తీవ్రత కారణంగా ప్రాణాలు కోల్పోయింది.
తరచూ నీలాద్రి అర్బన్ పార్క్ నుండి దుప్పులు, ఇతర జంతువులు జనావాసాల్లోకి రావడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. అయినా సరైన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. జంతువులు పార్క్ పరిధి దాటకుండా పటిష్టమైన కంచెలు, రక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..