Sanju Samson : ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌కు ముందు భారత అభిమానుల్లో ఒక చిన్న ఆందోళన మొదలైంది. సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ ఈ కీలక మ్యాచ్‌కు దూరమవుతాడా? ఐసీసీ అతని పై నిషేధం విధిస్తుందా? అన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. గత ఆదివారం వెస్టిండీస్‌పై గెలిచిన తర్వాత సంజు చేసిన ఒక సెలబ్రేషన్ ఈ వివాదానికి కారణమైంది. అయితే దీనిపై అంతర్జాతీయ అంపైర్లు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
అసలేం జరిగిందంటే.. వెస్టిండీస్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సంజు శాంసన్ విన్నింగ్ బౌండరీ కొట్టి భారత్‌ను గెలిపించాడు. ఆ ఆనందంలో సంజు తన హెల్మెట్‌ను తీసి కింద పడేసి, మోకాళ్లపై కూర్చుని ప్రార్థన చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో, కొందరు నిబంధనలను గుర్తు చేస్తూ ఫిర్యాదులు మొదలుపెట్టారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ (నిబంధన 2.2) ప్రకారం.. క్రికెట్ పరికరాలను (బ్యాట్, హెల్మెట్, స్టంప్స్) దుర్వినియోగం చేయడం లేదా విసిరేయడం నేరం. గతంలో స్కాట్లాండ్ ప్లేయర్ జార్జ్ మున్సే ఇలాగే హెల్మెట్ విసిరేసినందుకు డెమెరిట్ పాయింట్ పొందాడు. దీంతో సంజుపై కూడా చర్యలు ఉంటాయేమోనని ప్రచారం జరిగింది.
ఈ వివాదంపై మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. సంజు శాంసన్ కావాలని హెల్మెట్‌ను పాడు చేయలేదని, అది కేవలం భావోద్వేగంతో చేసిన సెలబ్రేషన్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అంపైర్ల నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూనో లేదా కోపంతోనో అలా చేసి ఉంటే శిక్ష పడే అవకాశం ఉండేదని, కానీ సంజు విషయంలో అటువంటిదేమీ లేదని ఆయన వివరించారు. సాధారణంగా ఇలాంటి ఘటనలను లెవల్ 1 నేరంగా పరిగణిస్తారు. దీనికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత లేదా డెమెరిట్ పాయింట్లు విధిస్తారు తప్ప, మ్యాచ్ నుంచి నిషేధించడం జరగదు.
గతంలో హర్మన్‌ప్రీత్ కౌర్ స్టంప్స్‌ను బ్యాట్‌తో కొట్టి, అంపైర్లను విమర్శించినప్పుడు ఆమెపై రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. అది లెవల్ 2 కిందకు వస్తుంది. కానీ సంజు చేసిన పనికి అటువంటి ముప్పు లేదని తేలిపోయింది. సంజు ప్రస్తుతం కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌లోనే 97 పరుగులతో చెలరేగాడు. ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్లో అతను ఆడటం ఖాయమని తెలియడంతో టీమిండియా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వాంఖడే గడ్డపై సంజు మరోసారి మెరుపులు మెరిపించాలని అందరూ కోరుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..