Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఉత్కంఠభరితంగా సాగిన నౌకౌట్ పోరులో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్, సగర్వంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ విజయంలో కేరళ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ విశ్వరూపం ప్రదర్శించాడు. విండీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శాంసన్ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ వల్లే భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన సంజూకు ఇది ఒక చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ అని చెప్పాలి.
ఈ అద్భుత విజయం తర్వాత సంజూ శాంసన్ తన మనసులోని మాటను పంచుకున్నాడు. తాను ఇంత బాగా ఆడటానికి గల కారణం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలేనని స్పష్టం చేశాడు. తాను భారత్ తరపున ఆడిన మ్యాచ్‌ల కంటే, డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని రోహిత్, విరాట్ బ్యాటింగ్‌ను చూసిన మ్యాచ్‌లే ఎక్కువని సంజూ గుర్తు చేసుకున్నాడు. “వారు మ్యాచ్‌ను ఎలా ఫినిష్ చేస్తారు? క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ప్రశాంతంగా ఉంటారు? అనేది వారిని చూసే నేర్చుకున్నాను. దాదాపు 100 మ్యాచ్‌ల్లో వారి ఆటను నిశితంగా గమనించాను. ధోనీ, రోహిత్, విరాట్ లాంటి దిగ్గజాలే నాకు స్ఫూర్తి. నా అరంగేట్రం నుంచి ఇలాంటి ఒక స్పెషల్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాను, అది ఈరోజు నెరవేరింది” అని సంజూ ఉద్వేగానికి లోనయ్యాడు.
వెస్టిండీస్‌పై సంజూ శాంసన్ చేసిన ఈ 97 పరుగుల ఇన్నింగ్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో పలు రికార్డులను తిరగరాసింది. ఈ క్రమంలో అతను టీమ్ ఇండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20 వరల్డ్ కప్ ఛేజింగ్‌లో ఒక భారత బ్యాటర్ సాధించిన అత్యధిక స్కోరుగా ఇది నిలిచింది. గతంలో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న 82 పరుగుల రికార్డును సంజూ అధిగమించాడు. అలాగే, ఓవరాల్‌గా టీ20 ప్రపంచకప్‌లో ఒక భారతీయుడు చేసిన రెండో అత్యధిక స్కోరు ఇది. 2024 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ చేసిన 92 పరుగుల రికార్డును కూడా సంజూ దాటేశాడు. ప్రస్తుతం సురేష్ రైనా (101) మాత్రమే శాంసన్ కంటే ముందున్నాడు.
సంజూ శాంసన్ అద్భుత ఫామ్‌పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. “మంచి మనసున్న వ్యక్తులకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. సంజూ గత కొన్నేళ్లుగా ఎంతో కష్టపడ్డాడు. జట్టులో చోటు కోసం ఎంతో ఓపికగా ఎదురుచూశాడు. కఠిన శ్రమకు తగిన ప్రతిఫలం ఇప్పుడు దక్కింది. తనలోని అసలైన శక్తిని ఈరోజు ప్రపంచానికి చాటిచెప్పాడు” అని సూర్య కొనియాడాడు. మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్‌తో మాట్లాడిన సంజూ.. తాను గతంలో చేసిన మూడు సెంచరీల కంటే ఈ 97 పరుగుల ఇన్నింగ్సే తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని వెల్లడించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..