
మూవీ రివ్యూ: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని
నటీనటులు: శివాజీ, లయ, మాస్టర్ రోహన్, ప్రిన్స్ సిసిల్, ఆలీ, ధనరాజ్ తదితరులు.
సంగీతం: రంజన్ రాజ్
సినిమాటోగ్రఫీ: రిత్విక్ రెడ్డి
నిర్మాతలు: శివాజీ
సమర్పణ: బన్నీ వాస్, వంశీ నందిపాటి, ఈటీవీ విన్
దర్శకత్వం: సుధీర్ శ్రీరామ్
మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత దాదాపు రెండు దశాబ్దాలకు శివాజీ, లయ జంటగా నటించిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. మొదట ఓటీటీలో రిలీజ్ అనుకున్నా, కంటెంట్ మీద నమ్మకంతో థియేటర్లలోకి వచ్చిన ఈ డార్క్ క్రైమ్ కామెడీ ప్రేక్షకులని ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ:
చిత్తూరు నేపథ్యంలో సాగే కథ ఇది. శ్రీరామ్ (శివాజీ) ఆ ఊరిలో ఒక నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీ. తన భార్య ఉత్తర (లయ), కొడుకు (మాస్టర్ రోహన్)తో కలిసి ఒక సాధారణ, సాంప్రదాయక మధ్యతరగతి జీవితం గడుపుతుంటాడు. అయితే ఎంతో అమాయకంగా కనిపించే ఈ కుటుంబం అనుకోకుండా ఒక ఊహించని క్రైమ్‌లో చిక్కుకుంటుంది. వాళ్ల జీవితంలోకి కొత్తకోట ఎస్సై (ప్రిన్స్) వచ్చిన తర్వాత జీవితాలు తలకిందులు అయిపోతాయి. అసలు ఆ నేరం ఏంటి? దాని వెనుక ఎవరున్నారు? పంచాయతీ సెక్రటరీగా ఉన్న శ్రీరామ్ తన కుటుంబాన్ని ఈ సమస్య నుంచి ఎలా బయటపడేశాడు? అనేది మిగతా కథ.
కథనం:
చాలా చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఓ నిజాయితీ గత ప్రభుత్వ ఉద్యోగి.. ఆ సిన్సియారిటీ కారణంగా వచ్చే సమస్యలు.. అందులోంచి పుట్టుకొచ్చే రాజకీయ అవాంతరాలు వీటన్నింటి చుట్టూనే కథ తిరుగుతుంది. అలాంటి చోట తన కుటుంబం కూడా ఇరుక్కుపోతే హీరో ఏం చేస్తాడు అనేది కథ. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా చూస్తున్నపుడు వద్దన్నా మనకు రెండు సినిమాలైతే కచ్చితంగా గుర్తుకొస్తాయి.. ఆ రెండూ మోహన్ లాల్ నటించినవే కావడం గమనార్హం. ఒకటి తుడరుమ్ అయితే మరోటి ఫేమస్ దృశ్యం. రెండూ మర్డర్ క్రైమ్ మిస్టరీలే.. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూనే తిరుగుతుంటాయి. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా కూడా అంతే. కాకపోతే ఇక్కడ దర్శకుడు ఎంచుకున్న ట్రీట్మెంట్ అంతా ఎంటర్టైన్మెంట్ పద్దతిలోనే ఉంటుంది. శివాజీ, లయల నటన.. వాళ్ల మధ్య కెమిస్ట్రీ సినిమాకు పెద్ద బలం. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని కామెడీ ఎపిసోడ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగానే కలిసొచ్చే విషయాలు. కాకపోతే సాగదీసినట్లు అనిపించే సెకండాఫ్, రొటీన్ స్క్రీన్ ప్లే, పెద్దగా ఇంపాక్ట్ చూపించని క్లైమాక్స్ ట్విస్ట్ ఆసక్తికరంగా అనిపించవు. అయినా కూడా తమ స్క్రీన్ ప్రజెన్స్‌తో శివాజీ, లయ బాగానే లాక్కొచ్చారు. ఫ్యామిలీ అంతా చూడ్డానికి పర్లేదనిపిస్తుంది. సెకండాఫ్ స్క్రీన్ ప్లే ఇంకాస్త టైట్‌గా రాసుకుని ఉండుంటే కచ్చితంగా ఇది ఇంకా మంచి సినిమా అయ్యుండేది. మాస్టర్ రోహన్ వచ్చే సీన్స్ ఓకే అనిపిస్తాయి. తన కుటుంబం కోసం హీరో చేసే ప్రతీ పనీ బాగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా పికప్ అయింది.. సెకండాఫ్‌లో మొదటి అరగంట కూడా బాగానే వెళ్లింది. చివర్లో రొటీన్ క్లైమాక్స్ ప్లాన్ చేయడం ఒక్కటే కాస్త నిరాశ కలిగించే విషయం.
నటీనటులు:
శివాజీ, లయ కాంబినేషన్ ఈ సినిమాకు అతిపెద్ద బలం. సగటు మధ్యతరగతి తండ్రిగా శివాజీ తనదైన సహజ నటనతో, పాత మార్క్ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక భర్తను డామినేట్ చేసే ‘ఉత్తర’ పాత్రలో లయ అద్భుతంగా నటించింది. వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యాయి. మాస్టర్ రోహన్ తన పాత్ర పరిధి మేర బాగానే చేశాడు. ఆలీ, ధనరాజ్, ప్రిన్స్ సిసిల్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నికల్ టీం:
రంజన్ రాజ్ నేపథ్య సంగీతం సినిమా మూడ్‌కి తగ్గట్లుగా సెట్ అయ్యింది. పాటలు లేకుండా కేవలం ఫ్లోతో వెళ్లిపోయారు మేకర్స్. రిత్విక్ రెడ్డి కెమెరా పనితనం చిత్తూరు పల్లెటూరి వాతావరణాన్ని చాలా న్యాచురల్‌గా చూపించింది. ఎడిటింగ్ విషయానికి వస్తే, సెకండాఫ్‌లో సీన్స్‌ను ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఫ్లో బాగుండేది. దర్శకుడు సుధీర్ శ్రీరామ్ ఎంచుకున్న పాయింట్, దాన్ని ఒక డార్క్ క్రైమ్ కామెడీగా చెప్పాలనుకున్న విధానం బాగున్నాయి. కానీ పేపర్ మీద ఉన్నంత గ్రిప్పింగ్‌గా తెర మీద ఎగ్జిక్యూట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ డార్క్ క్రైమ్ కామెడీ..