Riyan Parag : భారత క్రికెట్ జట్టు, రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ ప్రస్తుతం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీనికి కారణం అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ మరణం. సింగపూర్లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురైన జుబిన్ గార్గ్ మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త అస్సాంతో పాటు దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
అస్సాం ప్రముఖ గాయకుడు, సంగీత విప్లవకారుడుగా పేరు గాంచిన జుబిన్ గార్గ్ మరణం యావత్ దేశాన్ని శోకంలో ముంచింది. సింగపూర్లో స్క్యూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన జుబిన్ గార్గ్ మారుమూల ప్రాంతమైన అస్సాం సంస్కృతి, సంగీతాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన మరణంపై భారత క్రికెటర్ రియాన్ పరాగ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జుబిన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో లైవ్ వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నారు.
రియాన్ పరాగ్, జుబిన్ గార్గ్ను దాబంగ్ మామ అని ఆప్యాయంగా పిలిచేవారు. జుబిన్ మృతిపై రియాన్ మాట్లాడుతూ.. జుబిన్ మామ మరణం నా జీవితంలో ఒక పెద్ద లోటు. ఆయన సంగీతంతో అస్సాం సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన కేవలం పాటలు పాడటమే కాదు, ప్రతి పాటతో ప్రజల ఆలోచనలను మార్చారు. ఆయన పోయిన తర్వాత వచ్చిన ఈ ఖాళీని ఎవరూ భర్తీ చేయలేరు అని కన్నీళ్లు పెట్టుకున్నారు.
జుబిన్ గార్గ్ అస్సాం సంగీత ప్రపంచానికి ఒక కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. “సంగీతానికి భాష, ప్రాంతం అంటూ హద్దులు ఉండవు అని జుబిన్ మామ నిరూపించారు. ఆయన పాటలు అస్సాం సంస్కృతిని ప్రపంచమంతటా వ్యాప్తి చేశాయి” అని రియాన్ పరాగ్ కొనియాడారు.
జుబిన్ గార్గ్ సింగపూర్లో నార్త్ ఈస్ట్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు వెళ్లారు. అక్కడ స్క్యూబా డైవింగ్ చేస్తుండగా ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు. బాలీవుడ్లో ఆయనకు యా అలీ అనే సినిమా పాటతో పెద్ద పేరు వచ్చింది. ఆయన మరణం పట్ల అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..