
‘మ్యాజిక్ రైస్’.. ఈ పేరుకు తగ్గట్టుగానే అద్భుతమైన బియ్యం ఇది. వంట చేయాల్సిన అవసరం లేకుండా, కేవలం నీళ్లలో నానబెడితే చాలు, అరగంటలో అన్నం తయారవుతుంది. కరీంనగర్ జిల్లా, శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే రైతు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఈ మ్యాజిక్ రైస్‌ను సాగు చేస్తున్నాడు. దీనికి స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు, వండాల్సిన పని లేదు. కేవలం నీళ్లలో అరగంట నానబెడితే చాలు, అన్నం సిద్ధమైపోతుంది. శ్రీకాంత్ మొదటి నుంచీ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. తొలుత రసాయన ఎరువులతో వ్యవసాయం చేసినా, తర్వాత ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారు. సుభాష్ పాలేకర్ ప్రసంగాల ద్వారా ప్రేరణ పొంది, తొమ్మిది రాష్ట్రాలు పర్యటించి దాదాపు 120 రకాల దేశీయ వరి వంగడాలను సేకరించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా సేంద్రీయ విధానంలోనే వ్యవసాయం చేస్తున్నారు. పెట్టుబడి సమస్యలు, నీటి కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటూనే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.
శ్రీకాంత్ గతంలో అస్సాం నుంచి తీసుకొచ్చిన బోకాసాల్ అనే వరి రకం బియ్యం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. జూన్ నుంచి డిసెంబర్ వరకు సాగు చేసే ఈ పంట 145 రోజుల్లో చేతికి వస్తుంది. బోకాసాల్ బియ్యాన్ని చల్లటి నీళ్లలో నానబెడితే చల్లటి అన్నం, వేడి నీళ్లలో నానబెడితే వేడి అన్నం తయారవుతుంది. సరిపడా నీళ్లు పోసి సుమారు అరగంట నుంచి నలభై నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది. ఈ బియ్యం పోషక విలువలను గౌహతి యూనివర్సిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వంటి పరిశోధనా సంస్థలు వెల్లడించాయి. దీనిలో 10.73 శాతం పీచు(ఫైబర్), 6.8 శాతం ప్రొటీన్లు ఉంటాయని గుర్తించారు. అధిక పీచు శాతం కారణంగా, ఇది నెమ్మదిగా జీర్ణమై ఎక్కువ కాలం శక్తిని అందిస్తుందని శ్రీకాంత్ చెబుతున్నాడు. అంతరించిపోతున్న దేశీ వంగడాలలో ఇదొకటి. అస్సాంలోని గిరిజనులు, సైన్యం ఈ బియ్యాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. కూరలు లేకుండా కూడా తినగలిగే వరి ధాన్యం ఇది.
ఇది చదవండి: చనిపోయే 30 సెకన్ల ముందు మెదడులో ఏం జరుగుతుందంటే.? షాకింగ్ నిజం