
తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి రాబోయే రెండు రోజుల పాటు హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, తూర్పు తెలంగాణలోని ఆదిలాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
ఇక శుక్రవారం హైదరాబాద్ సహా నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు అధికారులు కొన్ని సూచనలు చేశారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని తెలిపారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు, విద్యుత్ స్థంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉందని.. పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.