ఇప్పటికే భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్న తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో హెచ్చరిక జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆయా జిల్లాల వివరాలను కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, ములుగు, మహబూబాబాద్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని.. వర్షాల ప్రభావాన్ని బట్టి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.
ఇదిలా ఉండగా సోమవారం కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అయితే తూర్పు మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతంతో ఈ నెల 25వ నాటికి అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో వర్షాలు పడుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఆ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర కోస్తా తీరం సమీపంలో ఈ నెల 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈ నెల 27న ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.