తెలంగాణ అంతటా మెఘాల దండయాత్ర కొనసాగుతోంది. గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని వరుణుడు వదలట్లేదు. హైదరాబాద్ నగరంతోపాటు.. వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు దండిగా కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్‌లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతారణ శాఖ వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఉత్తర/ ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. సగటు సముద్రమట్టం నుండి 5.8 కి మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. దీంతోపాటు.. మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మీదుగా ఉత్తర కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 4.5 కి మీ మధ్యలో ద్రోణి కొనసాగుతుందని తెలిపింది.. అంతేకాకుండా.. ఈనెల 25 వ తారీకు నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది..
ఆ అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశలో కదిలి వాయువ్య దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో దక్షిణ ఒడిస్సా ఉత్తర ఆంధ్ర కోస్తా తీరం సమీపంలో ఈనెల 26వ తారీకు నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈ నెల 27వ తారీఖు నాటికి తీరాన్ని దాటే అవకాశం ఉంది.. వీటి ప్రభావంతో రాగల నాలుగు రోజులు తెలంగాణకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ..
మంగళవారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
మంగళవారం తెలంగాణలోని కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే.. హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
బుధవారం తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..