జబల్పూర్, మార్చి 3: గూగుల్‌లో ఫోటోలను ఎడిట్ చేసి నకిలీ పత్రాలను తయారు చేసి.. వీటి రైల్వే శాఖకే పంగనామాలు పెట్టారు ఇద్దరు వ్యక్తులు. రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాల రాత పరీక్షలో నిజమైన అభ్యర్థి స్థానంలో నకిలీ వ్యక్తి పరీక్ష రాశాడు. అందుకు రూ.6 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. రాత పరీక్ష నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల వరకు నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించారు. సెప్టెంబర్ 2025లో విధుల్లో చేరిన తర్వాత బయోమెట్రిక్ వెరిఫికేషన్‌లో బొటనవేలు, ముఖం సరిపోలకపోవడంతో మొత్తం మోసం వెలుగులోకి వచ్చింది. దీనిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బీహార్ నుంచి వారిద్దరినీ అరెస్టు చేసి జబల్పూర్ కోర్టులో హాజరుపరిచింది. అక్కడి నుంచి వారిని జైలుకు తరలించారు.
2024 సంవత్సరానికి ఇండియన్ రైల్వే ఆల్ ఇండియా రిక్రూట్మెంట్కు సంబంధించిన టెక్నీషియన్ పోస్టులకు దాదాపు 8, 000 ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. ముంగేర్ నివాసి ముఖేష్ కుమార్ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం స్థానికంగా ఉన్న ఓ కోచింగ్ సెంటర్ నడుపుతున్న రంజిత్‌కుమార్‌న్ ముఖేష్ సంప్రదించాడు. మొదట్లో ముఖేష్ అభ్యర్ధనను రంజీత్ నిరాకరించాడు. అయతే అతడు రూ.6 లక్షలు ఇస్తానని ఆశ చూపడంతో రంజిత్.. ముఖేష్ స్థానంలో పరీక్ష రాయడానికి అంగీకరించాడు. డిసెంబర్ 2024లో పాట్నాలో జరిగిన CBT పరీక్షలో రంజీత్ ముఖేష్‌గా హాజరై ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల కోసం అతన్ని భోపాల్‌కు పిలిపించారు. అక్కడ వైద్య పరీక్ష కోటా ఆసుపత్రిలో జరిగింది. జూలై 2025లో విడుదల చేసిన ప్యానెల్లో ముఖేష్ ఎంపికైనట్లు ఫలితాలు వచ్చాయి.
దీంతో జూలై 12, 2025న జరిగిన ఉద్యోగ మేళాకు హాజరై ఆ తర్వాత, అతను సెప్టెంబర్‌లో ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో దామోహ్, సాగర్, జబల్పూర్లలో కూడా పనిచేశాడు. తరువాత అక్టోబర్ 2025లో అతన్ని శిక్షణ కోసం ప్రయాగ్‌రాజ్‌కు పంపారు. ఇప్పటి వరకు అంతా సజావుగా జరిగినప్పటికీ నవంబర్ 2025లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ సమయంలో మొత్తం యవ్వారం బయటపడింది. రైల్వే నిబంధనల ప్రకారం కొత్త ఉద్యోగులకు ఏడాదిలోపు బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. నవంబర్ 14న జరిగిన ఈ పరీక్ష సమయంలో బొటనవేలు, ముఖ గుర్తింపు సరిపోలలేదు. దీంతో అధికారుల్లో అనుమానాన్ని రేకెత్తించింది. దీంతో మోసం గుర్తించిన జబల్పూర్ విభాగం CBIకి లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 2, 2025న ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. మోసం బయపడటంతో ముఖేష్ ఎవరికీ తెలియజేయకుండా బీహార్ పరార్ అయ్యాడు.
ఇవి కూడా చదవండి
అయితే నిందితుడు ముఖేష్ కాల్ వివరాలు, లొకేషన్ సమాచారం ఆధారంగా సీబీఐ టీం ముంగేర్‌కు చేరుకుని ముఖేష్‌ను అదుపులోకి తీసుకుంది. విచారణలో అతను మొత్తం కుట్రను వెల్లడించాడు. దీంతో రంజీత్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసింది. ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తులో మరో షాకింగ్ విషయం వెల్లడైంది. దరఖాస్తు ఫారమ్‌లో ఉపయోగించిన ఫోటో రెండు ఛాయాచిత్రాల మిశ్రమంగా ఉంది. అవసరమైతే అది పాత ఫోటో అని చెప్పి తప్పించుకోవచ్చని నిందితులు అనుకున్నారు. కానీ ఊహించని విధంగా బయోమెట్రిక్ టెస్ట్ వీరి మోసాన్ని బయటపెట్టింది. ఇందులో మాస్టర్ మైండ్ అయిన రంజీత్.. ఇలా ఇప్పటి వరకు ఎంత మందికి బదులుగా పరీక్షకు హాజరై ఉద్యోగాలు ఇప్పించాడనే దానిపై CBI దర్యాప్తు చేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.