Ragi Uthappam: బరువు తగ్గాలనుకునే వారికి వరప్రసాదం.. రాగి ఊతప్పం ట్రై చేసి చూడండి

Ragi Uthappam: బరువు తగ్గాలనుకునే వారికి వరప్రసాదం.. రాగి ఊతప్పం ట్రై చేసి చూడండి


కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాల గని అయిన రాగులతో వంటలంటే కేవలం రాగి ముద్ద లేదా అంబలి మాత్రమే కాదు.. నోరూరించే వెరైటీలు కూడా చేసుకోవచ్చు. కేవలం పది నిమిషాల్లో సిద్ధమయ్యే రుచికరమైన రాగి ఊతప్పం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

ఆరోగ్యం కోసం చిరుధాన్యాలు తినాలని అందరూ చెబుతుంటారు. కానీ, రాగి అంబలి లేదా సంగటి తినడం అందరికీ నచ్చకపోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉండే చిన్న పిల్లలు వీటిని చూస్తేనే దూరంగా పారిపోతుంటారు. మరి రాగుల్లో ఉండే అద్భుతమైన పోషకాలు శరీరానికి అందాలంటే ఏం చేయాలి? అదే రాగి పిండితో హోటల్ స్టైల్‌లో కలర్‌ఫుల్‌గా, టేస్టీగా ఉండే ఒక అల్పాహారాన్ని సిద్ధం చేయవచ్చు. ఇది తింటే రాగులతో చేశారంటే ఎవరూ నమ్మరు.

కావలసిన పదార్థాలు

ఈ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కోసం ఒక కప్పు రాగి పిండి, అర కప్పు రవ్వ, ముప్పావు కప్పు పెరుగు సిద్ధం చేసుకోవాలి. రుచి కోసం ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ, సగం గ్రీన్ క్యాప్సికం, చిన్న అల్లం తురుము, రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి. తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు అర స్పూన్ చొప్పున, చిటికెడు బేకింగ్ సోడా, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, కాల్చడానికి తగినంత నూనె ఉండాలి.

తయారు చేసుకునే విధానం

  • ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో రవ్వ, పెరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత రాగి పిండిని చేర్చి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, అల్లం తురుము, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి బాగా మిక్స్ చేయాలి. అవసరమైతే కొన్ని నీళ్లు పోసి దోశ పిండి కంటే కొంచెం మందంగా కలుపుకుని 5 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. దీనివల్ల రవ్వ మెత్తబడి ఊతప్పం సాఫ్ట్‌గా వస్తుంది.
  • స్టవ్ మీద నాన్‌స్టిక్ తవా పెట్టి వేడి చేయాలి. ఈలోపు పక్కన పెట్టిన పిండిలో ఉప్పు, బేకింగ్ సోడా, కరివేపాకు వేసి మరోసారి కలపాలి. పెనం వేడెక్కాక కొద్దిగా నూనె రాసి, ఒక గరిటె పిండిని తీసుకుని మందపాటి ఊతప్పంలా వేయాలి. దీనిపై కొద్దిగా నూనె వేసి, మూత పెట్టి తక్కువ మంట మీద ఉడికించాలి.
  • రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా కాల్చుకోవాలి. పైన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతే.. వేడివేడి రాగి ఊతప్పం సిద్ధం. దీనిని పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ లేదా పెరుగుతో తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది.

షుగర్ వ్యాధితో బాధపడే వారికి రాగి ఊతప్పం ఒక బెస్ట్ ఆప్షన్. ఇది తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు, తద్వారా అనవసరమైన ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. తక్కువ సమయంలోనే ఎంతో పోషకవిలువలున్న ఈ వంటకాన్ని మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *