బ్యాకింగ్, పేమెంట్స్ కు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఆన్ లైన్ అయినప్పటికీ.. పోస్టాఫీస్ పొదుపు పథకాల కోసం మాత్రం ఇప్పటికీ పోస్టాఫీస్ కు వెళ్లాల్సి వస్తోంది. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా ఇండియా పోస్ట్ ఇ పాస్ బుక్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇకపై పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలను ఆన్ లైన్ లో లేదా మొబైల్ లోనే తెలుసుకోవచ్చు.
ఇ-పాస్‌బుక్ అంటే ఏమిటి?
ఇదొక డిజిటల్ పాస్‌బుక్. ఆన్ లైన్ బ్యాకింగ్ లాగానే పనిచేస్తుంది. మీ పోస్టాఫీస్ పొదుపు ఖాతాలోని అన్ని లావాదేవీలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోడానికి ఇ పాస్ బుక్ పనికొస్తుంది. మీ రీసెంట్ ట్రాన్సాక్షన్స్ తో కూడిన మినీ-స్టేట్‌మెంట్‌ను కూడా ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ సర్విస్ ప్రస్తుతానికి మూడు పథకాలకు మాత్రమే అందుబాటులో ఉంది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి అకౌంట్ వివరాలు మాత్రమే ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మిగతా సర్వీసులు కూడా ఆన్ లైన్ చేస్తామని ఇండియా పొస్ట్ చెప్తోంది.
ఇలా వాడాలి
ఇ- పాస్ బుక్ ను యాక్సెస్ చేయడం చాలా ఈజీ.
- ముందుగా పోస్టాఫిస్ వెబ్‌సైట్(posbseva.indiapost.gov.in) లోకి వెళ్లాలి అక్కడ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ (OTP) ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- తర్వాతి పేజీలో ఇ- పాస్ బుక్ “ePassbook” అనే ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు, మీ అకౌంట్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. మళ్ళీ క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేస్తే.. మీరు మీ ఇపాస్‌బుక్‌ని చూడవచ్చు.
- ఈ ఆన్ లైన్ ఫెసిలిటీ ద్వారా పోస్టాఫీస్ అకౌంట్ హోల్డర్లు ఎప్పుడైనా, ఎక్కడైనా మీ అకౌంట్ వివరాలను చెక్ చేసుకోవచ్చు. పోస్టాఫీస్ కు వెళ్లడం, పాస్ బుక్ పోగొట్టుకోవడం వంటి సమస్యలు ఉండవు.
కొన్ని ఛార్జీలు కూడా..
ఇ-పాస్‌బుక్ సేవ ఉచితమే అయినప్పటికీ.. పాస్ బుక్ పోగొట్టుకున్నవాళ్లు డూప్లికేట్ పాస్‌బుక్ పొందడానికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఖాతా స్టేట్‌మెంట్/ డిపాజిట్ రసీదు కోసం కొన్నిసార్లు రూ. 20 చెల్లించాల్సి ఉంటుంది. పది కంటే ఎక్కువ ఉచిత చెక్కులు అవసరమైతే, ప్రతి చెక్కు లీఫ్‌కు రూ. 2 రుసుము వసూలు చేయబడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి