దేశంలో సోమవారం నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో ఆయన పలు కీలక ప్రకటనలు చేయవచ్చని భావిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రసంగం దేని గురించి ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. అయితే కొత్త జీఎస్టీ రేట్ల గురించి ఆయన మాట్లాడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేపటి నుంచి కొన్ని వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇది సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ కొత్త రేట్ల గురించి ఆయన వివరించే అవకాశం ఉంది.
ఇటీవలే జీఎస్టీలో కేంద్రం కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ఇకపై 5, 18, 40 శాతం పన్ను స్లాబులు మాత్రమే ఉండనున్నాయి. 200పైగా వస్తువులపై పన్ను తగ్గించి, మధ్యతరగతి, సామాన్యులకు కేంద్రం ఊరట కల్పించింది. గతంలో 12 శాతం స్లాబ్‌లోని 99 శాతం వస్తువులు 5 శాతం స్లాబ్‌లోకి వస్తాయి. 28 శాతం స్లాబ్‌లోని 90 శాతం వస్తువులు 18 శాతంలోకి రాబోతున్నాయి. దసరా, దీపావళి ముందు పన్ను రేట్లు తగ్గడంతో కొనుగోళ్లు పెరుగుతాయన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ చేయబోయే ప్రసంగంలో ఏయే అంశాలు ఉంటాయనేది కీలకంగా మారింది.
అంతేకాకుండా ఇటీవల గుజరాత్ పర్యటనలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇతర దేశాలపై ఆధారపడటం మన నిజమైన శత్రువు అని పేర్కొన్నారు. ఈ అంశంతో పాటు ట్రంప్ విధించిన 50శాతం టారీఫ్స్, కొత్త హెచ్1-బీ వీసా ఫీజుల గురించి కూడా ఆయన ప్రస్తావించవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు రేపటి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి ఉత్సవాల గురించి కూడా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ ఏడాది నవరాత్రి చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి