PM Modi: మైదానంలోనూ ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎక్కడైనా ఫలితం ఒక్కటే: ప్రధాని మోదీ సంచలన పోస్ట్..

PM Modi: మైదానంలోనూ ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎక్కడైనా ఫలితం ఒక్కటే: ప్రధాని మోదీ సంచలన పోస్ట్..


చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అదిరే విజయం సాధించి భారత్‌ ఆసియా కప్‌ విజేతగా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్‌ పోరులో దాయాది జట్టుపై టీమ్‌ఇండియా 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బౌలర్లు విజృంభించడంతో పాక్‌ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు స్టార్టింగ్‌లోనే షాక్‌ తగిలింది. ఈ టోర్నీలో సూపర్‌ ఫామ్‌లో ఉన్న అభిషేక్‌ శర్మ రెండో ఓవర్‌ తొలి బంతికి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య… షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో సల్మాన్‌ అఘాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఇక టీమ్‌ ఇండియా 20 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. ఫహీమ్‌ అష్రప్‌ బౌలింగ్‌లో నాలుగో ఓవర్‌ చివరి బంతికి రవూఫ్‌కు క్యాచ్‌ ఇచ్చి గిల్‌ పెవిలియన్‌ చేరాడు. దీంతో భారత్‌ నాలుగో ఓవర్లకు ముగిసే సరికి 25/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్నందించాడు. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ ఆదుకున్నాడు. సంజూ శాంసన్, శివమ్ దూబే సాయంతో టీమిండియాకు విజయ తిలకం దిద్దాడు. చివరికి ఓవర్‌‌లో టీమిండియాకు 10 పరుగులు అవసరమవ్వగా.. తిలక్ వర్మ సిక్స్ బాది, సింగిల్ తీయగా.. రింకూ సింగ్ బౌండరీ బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ టోర్నీ మొత్తంలో ఒకే ఒక్క బంతి ఆడిన రింకూ సింగ్.. విన్నింగ్ షాట్‌తో మ్యాచ్ ఫినిషర్‌గా తన సత్తా చాటుకున్నాడు.

మైదానంలోనూ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కనిపించిది: ప్రధాని మోదీ

ఫైనల్లో పాక్‌ను భారత్‌ మట్టికరిపించడంపై ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. యుద్ధభూమిలోనూ, మైదానంలోనూ ఒక్కటే ఫలితమన్నారు. ‘‘మైదానంలోనూ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కనిపించింది. ఎక్కడైనా ఫలితం ఒక్కటే. ఇండియా గెలిచింది. భారత క్రికెటర్లకు అభినందనలు’’ అంటూ పోస్ట్‌ చేశారు మోదీ..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా  టిమిండియాకు అభినందనలు తెలిపారు. ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ గెలిచినందుకు టీం ఇండియాకు నా హృదయపూర్వక అభినందనలు. టోర్నమెంట్‌లో జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.. ఆటలో దాని ఆధిపత్యాన్ని సూచిస్తుంది. భవిష్యత్తులో టీం ఇండియా కీర్తిని నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను.. అంటూ ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు.

ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా టీమ్‌ ఇండియాకు అభినందనలు తెలుపుతు పోస్టులు పెట్టారు. ఈ అద్భుత విజయం సాధించడం లో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ తిలక్ వర్మ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ లో తెలంగాణ రాష్ట్రాని కి గొప్ప పేరు, గౌరవం తెచ్చారని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు సీఎం రేవంత్‌ రెడ్డి.

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు.. అద్భుతమైన టీం వర్క్, డెడికేషన్, ఆత్మవిశ్వాసంతో పాకిస్తాన్ మీద విజయం సాధించి దేశం గర్వించేలా చేశారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఈ గెలుపుతో భారత్ ఆసియా కప్ చరిత్రలో తొమ్మిదో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ముఖ్యంగా పాకిస్థాన్‌తో ఒకే టోర్నీలో మూడుసార్లు తలపడగా, మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాయి. తిలక్ వర్మ ధైర్యవంతమైన ఇన్నింగ్స్, కుల్దీప్ స్పిన్ మాయా ఈ ఫైనల్‌ను ప్రత్యేకంగా మార్చాయి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *