PAK vs ENG : పల్లెకెలెలో పాక్-ఇంగ్లండ్ పోరు..వాతావరణం కారణంగా మ్యాచ్ రద్దయితే బాబర్ సేన పరిస్థితి ఏంటి?

PAK vs ENG : పల్లెకెలెలో పాక్-ఇంగ్లండ్ పోరు..వాతావరణం కారణంగా మ్యాచ్ రద్దయితే బాబర్ సేన పరిస్థితి ఏంటి?


PAK vs ENG : శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా నేడు టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్-2లో భాగంగా పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్, పాకిస్థాన్‌కు చావో రేవో లాంటిది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఇంగ్లండ్‌పై పాక్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు పల్లెకెలెలో వాతావరణం ఎలా ఉంది? ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే పాక్ పరిస్థితి ఏంటనే ఆసక్తికరమైన లెక్కలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.

ముందుగా పాయింట్ల పట్టికను గమనిస్తే.. ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం 2 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. వారి నెట్ రన్ రేట్ (+2.550) కూడా చాలా బలంగా ఉంది. మరోవైపు పాకిస్థాన్ ఆడిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో, న్యూజిలాండ్‌తో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం పాక్ ఖాతాలో కేవలం ఒకే ఒక పాయింట్ ఉంది. ఆతిథ్య శ్రీలంక పాయింట్లు ఏమీ లేకుండా అట్టడుగున ఉండగా, నేటి మ్యాచ్ ఫలితం పాకిస్థాన్ భవితవ్యాన్ని తేల్చనుంది.

ఒకవేళ నేడు కూడా పల్లెకెలెలో వరుణుడు ప్రతాపం చూపి మ్యాచ్ రద్దయితే, పాకిస్థాన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతుంది. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు ఇంగ్లండ్ 3 పాయింట్లతో ముందంజలో ఉంటుంది, పాక్ 2 పాయింట్లతో మిగిలిపోతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 28న శ్రీలంకపై పాక్ గెలిచినా, గరిష్టంగా 4 పాయింట్ల వరకు మాత్రమే వెళ్లగలదు. అప్పుడు పాక్ సెమీస్ చేరడం అనేది ఇతర జట్ల ఓటమిపై, తమ నెట్ రన్ రేట్‌పైనే ఆధారపడి ఉంటుంది. శ్రీలంకపై భారీ విజయం సాధించి రన్ రేట్‌ను మెరుగుపరుచుకుంటేనే పాక్‌కు సెమీస్ తలుపులు తెరుచుకుంటాయి.

అయితే పాకిస్థాన్ అభిమానులకు ఒక స్వీట్ న్యూస్ ఏంటంటే.. నేడు పల్లెకెలెలో వాతావరణం క్రికెట్‌కు అనుకూలంగా ఉంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం నేడు వర్షం కురిసే అవకాశాలు దాదాపు లేవు. ఆకాశం చాలా స్పష్టంగా ఉంటుందని సమాచారం. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి 20 ఓవర్ల మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌ను ఓడించి పూర్తి 2 పాయింట్లు సాధిస్తే, పాకిస్థాన్ తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవడమే కాకుండా గ్రూప్‌లో పటిష్ట స్థితికి చేరుకుంటుంది. మరి బాబర్ ఆజం సేన ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *