నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. అటు థియేటర్లలోనూ, ఇటు ఓటీటీలోనూ వీటికి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా ఓటీటీ ఆడియెన్స్ ఈ రియల్ స్టోరీలను ఎగ బడి చూసేస్తున్నారు. ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగానే ఫిల్మ్ మేకర్లు, ఓటీటీ సంస్థలు బయోపిక్స్, రియల్ స్టోరీలంటూ ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సిరీస్ కూడా ఒక రియల్ స్టోరీనే. 1982లో దేశ రాజధాని ఢిల్లీని కుదిపేసిన తిహార్ జైలు ఘటన ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ కు ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్ దక్కింది. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. 1978లో ఆగస్టులో కుల్జిత్ సింగ్, జస్బీర్ సింగ్ అనే అన్నదమ్ములు ఒక నేవీ అధికారి పిల్లలను కిడ్నాప్ చేశారు. గీతా చోప్రా, సంజయ్ చోప్రా అనే ఈ ఇద్దరు పిల్లలు ఓ ఈవెంట్ కోసం బయటకు రాగా అదే దారిలో కాపు కాసి ఉన్న కుల్జిత్ సింగ్, జస్బీర్ సింగ్ వారిని అపహరించారు. అనంతరం అడవిలోకి తీసుకెళ్లి గీతపై అత్యాచారం చేసి ఇద్దరిని దారుణంగా హతమార్చారు. రెండు రోజుల తీవ్ర గాలింపు తర్వాత దట్టమైన అడవిలో ఓ పశువుల కాపరికి ఆ ఇద్దరు పిల్లల మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. నిందితులు కల్కా మెయిల్ అనే రైలులో ప్రయాణిస్తుండగా అదే కోచ్ లో ఎక్కిన ఒక ఆర్మీ అధికారి వీరిద్దరిని గుర్తుపట్టి, ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.
ఢిల్లీని కుదిపేసిన ఈ కేసులో అన్నదమ్ములను తీహార్ జైల్లో ఉంచారు. ఢిల్లీ హైకోర్టు ఈ ఇద్దరు వీరికి ఉరిశిక్షను విధించింది. సుప్రీం కోర్టు సైతం ఈ ఉరిని సమర్ధించింది. 1982 జనవరి 31న ఢిల్లీలోని తిహార్ జైలులో ఈ అన్నదమ్ములను ఉరి తీశారు. అయితే ఉరి తీయగానే కుల్జిత్ సింగ్ చనిపోయినప్పటికీ, జస్బీర్ సింగ్ మాత్రం 2 గంటల పాటు బ్రతికే ఉన్నాడట. అప్పట్లో ఉరి తీసేటప్పుడు బాడీ వెయిట్ లాంటి మెజర్మెంట్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని సమాచారం. ఈ విషయాన్ని తిహార్ జైలు మాజీ అధికారి సునీల్ గుప్తా, జర్నలిస్ట్ సునీత చౌదరి తమ ‘బ్లాక్ వారెంట్’ అనే పుస్తకంలో ప్రస్తావించారు. ఆ బుక్ ఆధారంగానే ఈ సిరీస్ తెరకెక్కింది.
విక్రమాదిత్య మోత్వాని, సత్యాన్షు సింగ్ తెరకెక్కించిన ఈ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ పేరు ‘బ్లాక్ వారెంట్. మొత్తం 7 ఎపిసోడ్లు ఈ సిరీస్ లో ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాల పాటు ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఈ థ్రిల్లింగ్ సిరీస్.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.