
ఈ ఆధునిక యుగంలో ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చేది ఆర్గానిక్ ఫుడ్. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ల నుండి స్థానిక దుకాణాల వరకు ప్రజలు ఆర్గానిక్ పండ్లు, కూరగాయలు, ఇతర ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇవి మరింత పోషకమైనవి, సురక్షితమైనవి, ఆరోగ్యకరమైనవి అని చాలామంది నమ్ముతారు. కానీ నిజంగా సేంద్రీయ ఆహారం సాంప్రదాయ ఆహారం కంటే ఆరోగ్యకరమైనదేనా..? నిపుణులు ఈ విషయంపై ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
పోషక విలువల్లో తేడా లేదా?
సేంద్రీయ ఆహారం సాంప్రదాయ ఆహారం కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సేంద్రీయ – సాంప్రదాయ ఆహారాల మధ్య పోషక విలువల్లో పెద్దగా తేడా ఉండదు. అనేక అధ్యయనాలు రెండింటిలోనూ దాదాపు ఒకే స్థాయిలో విటమిన్లు, ఖనిజాలు, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉన్నాయని కనుగొన్నాయి. పోషకాల కోసం మాత్రమే మీరు ఆర్గానిక్ ఫుడ్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు.. ఒక ఆపిల్ దాని రకాన్ని బట్టి పోషక విలువలు కలిగి ఉంటుందే తప్ప అది సేంద్రీయంగా పండిందా లేదా అన్న దానిపై ఆధారపడి ఉండదు.
పురుగుమందుల విషయంలో ..
పోషకాల విషయంలో పెద్దగా తేడాలు లేకపోయినా పురుగుమందుల విషయంలో మాత్రం ఆర్గానిక్ ఆహారం ఒక అడుగు ముందుంటుంది. సేంద్రీయ ఉత్పత్తులలో సాంప్రదాయ ఆహారం కంటే 30 శాతం తక్కువ పురుగుమందులు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. పురుగుమందుల అవశేషాలకు దీర్ఘకాలంగా గురికావడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ముఖ్యంగా రైతులు వంటి వారికి ఇది వర్తిస్తుంది. అయితే , పండ్లు, కూరగాయలను సరిగ్గా కడగడం లేదా వండడం ద్వారా ఈ పురుగుమందుల అవశేషాలు తగ్గిపోతాయి. ఈ తక్కువ మోతాదులో ఉండే పురుగుమందులతో పెద్దగా ప్రమాదం ఉండదు.
గర్భిణీ స్త్రీలు – పిల్లలకు..
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆర్గానిక్ ఆహారం సాంప్రదాయ ఆహారం కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలకు ఇది మంచిది. వారి శరీరాలు పురుగుమందుల అవశేషాలకు ఎక్కువ సున్నితంగా ఉంటాయి కాబట్టి సేంద్రీయ ఆహారాన్ని ఎంచుకోవడం సురక్షితమైనదిగా పరిగణించవచ్చు.
ఆరోగ్యకరమైన జీవనశైలి ముఖ్యమా?
ఆర్గానిక్ ఆహారాన్ని ఎంచుకునేవారు సాధారణంగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తారు. ఈ జీవనశైలి వల్లే వారు మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతారు తప్ప కేవలం సేంద్రీయ ఆహారం వల్ల మాత్రమే కాదు. కాబట్టి నిపుణుల సలహా ఏమిటంటే.. ఆహారం సేంద్రీయమా కాదా అని మాత్రమే చూడకుండా మొత్తంమీద మన ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలి.
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.