హైదరాబాద్, సెప్టెంబర్ 27: హైదరాబాద్ MGBSను ముంచేసిన మూసీ వరద. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జలదిగ్బంధంలో చిక్కుకున్న ఎంజీబీఎస్. బస్‌స్టేషన్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు. ప్రయాణికులను తాళ్ల సాయంతో తరలిస్తున్న సిబ్బంది. బస్టాండ్‌కు బస్సుల రాకపోకలను నిలిపివేసిన అధికారులు. వరద నీటిలో చిక్కుకున్న హైదరాబాద్ MGBS. తీవ్ర ఇబ్బందుల్లో ప్రయాణికులు. బస్సులు రాకుండా నిలిపివేసిన అధికారులు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. అది కాస్తా కిందకు వెళ్లకపోవడంతో సమీప ప్రాంతాల్లోని కాలనీల్లోకి చేరింది. అందులో MGBSను కూడా ముంచెత్తింది.
శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద చుట్టుముట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది ప్రయాణికులను తాళ్ల సాయంతో బయటకు పంపించారు. నల్గొండ, ఖమ్మం, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులు ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ వరకే అనుమతి చేశారు. మహబూబ్‌నగర్, కర్నూలు నుంచి వచ్చే బస్సులు ఆరంగర్ దగ్గర నుంచి మళ్లించారు. వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులను ఉప్పల్ రింగ్ రోడ్డు వరకే పరిమితం చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే వాహనాలను JBS వరకే పరిమితం చేశారు. సీఎం ఆదేశాలతో MGBS చేరుకొని పరిస్థితిని సమీక్షించిన ఈస్ట్ జోన్ DCP బాలస్వామి. మూసీ వరద నీరు MGBSలోకి వచ్చిన సమయంలో సుమారు 3 వేల మంది ప్రయాణికులు బస్టాండ్‌లో ఉన్నారు.
ఇక నదికి ఇరువైపులా అంబేడ్కర్ బస్తీతో సహా పలు కాలనీలు నీట మునిగాయి. అధికారులు వందల మందిని సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. మూసానగర్, శంకర్‌నగర్ బస్తీల్లోని పలు కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేయకపోవడంతో పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ రెండు వంతెనలపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపేశారు. దీంతో దిల్‌సుఖ్‌నగర్, కోఠి మధ్య ట్రాఫిక్ సమస్య తలెత్తింది. నార్సింగి వద్ద ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్లు మూసుకుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం తలెత్తింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. పటాన్‌చెరు వైపు జాతీయ రహదారి కూడా నీట మునిగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.