మొబైల్ లో ఇంటర్నెట్ సరిగా పనిచేయకపోతే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే చాలామంది ఇంటర్నెట్ స్పీడ్ తగ్గితే అది నెట్వర్క్ ప్లాబ్లమ్ అనుకుంటారు. నెట్వర్క్ ప్రాబ్లమ్ అయితే ఎప్పుడో ఒకసారి స్లో అవుతుంది. అలాకాకుండా సిగ్నల్ బాగానే ఉన్నా.. నెట్ స్లో స్లో అవుతుందంటే దానికి వేరే కారణాలు ఉండి ఉండొచ్చు. అవేంటంటే..
బ్యాక్‌గ్రౌండ్ యాప్స్
బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువ యాప్స్ రన్ అవుతూ ఉండడం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి నెట్ స్లో అయినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ అన్నీ క్లోజ్ చేసి చూడాలి. అలాగే ఒకసారి డేటా ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఇలా చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ పెరిగే అవకాశం ఉంది.
కనెక్షన్ ప్రాబ్లమ్
కొన్నిసార్లు నెట్‌వర్క్ కనెక్షన్ లో వచ్చే సమస్యల కారణంగా ఇంటర్నెట్ ఆగిపోతుంటుంది. అలాంటప్పుడు ఫోన్‌లో ‘ఏరోప్లేన్ మోడ్’ ఆన్ చేసి మళ్లీ ఆఫ్ చేస్తే కనెక్షన్ రీసెట్ అవుతుంది. లేదా ఫోన్ రీస్టార్ట్ కూడా చేయొచ్చు.
ఆటోమేటిక్ అప్‌డేట్స్
ఫోన్‌లోని యాప్స్ కు ఆటోమేటిక్ అప్‌డేట్స్ సెట్టింగ్ ఆన్‌లో ఉంచితే.. అప్ డేట్స్ వచ్చినా ప్రతిసారీ బ్యాక్ గ్రౌండ్ లో డేటాను వాడుకుంటూ ఉంటాయి. దానివల్ల ఇంటర్నెట్ స్లో అయిపోతుంది. కాబట్టి ఆటో అప్‌డేట్ సెట్టింగ్‌ను ఆఫ్‌లో ఉంచుకుని అప్పుడప్పుడు యాప్స్ ను అప్ డేట్ చేసుకుంటూ ఉంటే మంచిది.
నెట్వర్క్ టైప్
ఇంటర్నెట్ కనెక్షన్ లో తరచూ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు సిగ్నల్ ఆగిపోకుండా ఉండాలంటే కనెక్టివిటీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘నెట్‌వర్క్ టైప్’ను కేవలం 4జీ లేదా 5జీ కాకుండా ఆటోమెటిక్‌లో ఉంచుకోవాలి. అప్పుడు సిగ్నల్ స్ట్రెంత్‌ను బట్టి డేటా మోడ్ ఆటోమెటిక్‌గా మారుతుంటుంది. ఇంటర్నెట్ ఆగిపోయే అవసరం ఉండదు.
డేటా సేవింగ్ మోడ్
ప్రతి మొబైల్ లో డేటా సేవింగ్ మోడ్ అనే ఫీచర్ ఉంటుంది. దాన్ని ఆన్ లో ఉంచుకోవడం ద్వారా ప్రస్తుతానికి అవసరం లేని ఇంటర్నెట్ యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ అవుతాయి. తద్వారా ఇంటర్నెట్ స్పీడ్ కాస్త పెరుగుతుంది. అలాగే ఫోన్ బ్రౌజర్‌లో క్యాచీ, కుకీస్ వంటివి కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది.