
ఫ్యాటీ లివర్ అనేది క్రమంగా లివర్‌లో కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే వ్యాధి. ఇది తొలి దశలో ఎటువంటి లక్షణాలను ప్రదర్శించకపోవచ్చు, దీనివల్ల చాలా మంది దీనిని అస్సలు గుర్తించలేరు. కానీ, కాలక్రమేణా ఈ వ్యాధి తీవ్రత పెరిగితే అలసట, బరువు తగ్గడం, చిరాకు, జీర్ణక్రియ సమస్యలు, మూత్రం పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. పరిస్థితి చేయి దాాటితే.. జాండిస్, సిరోసిస్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా సంభవించవచ్చు.
ఈ వ్యాధికి ప్రధాన కారణాలలో అనారోగ్యకరమైన ఆహారం ముఖ్యమైనది. అధిక ఫ్రక్టోస్ (ఫ్రూట్ జ్యూసులు, సోడాస్, బేకరీ ఉత్పత్తులు, మిఠాయిలు) వినియోగం లివర్‌లో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. రిఫైన్డ్ ఆయిల్స్, ఫ్రైడ్ ఫుడ్స్, అధిక కేలరీల ఆహారం కూడా ఫ్యాటీ లివర్‌కు దారితీస్తాయి. అలాగే, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం, మద్యపానం, మనస్థాపకాలు కూడా ఈ వ్యాధికి కారణం కావచ్చు. తాజా అధ్యయనాలు.. గాలి కాలుష్యం కూడా ఫ్యాటీ లివర్‌కు కారణం కావచ్చని సూచిస్తున్నాయి. ఫ్యాటీ లివర్‌ను నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. సమతుల్య ఆహారం, రోజూ వ్యాయామం, నిద్ర సరిగ్గా పోవడం చాలా ముఖ్యం.
ఫ్రక్టోస్ వినియోగాన్ని తగ్గించడం, రిఫైన్డ్ ఆయిల్స్‌ను తగ్గించి ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించడం మంచిది. ఫ్రైడ్ ఫుడ్స్‌ను తగ్గించడం, ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు తినడం, సరిపోయే నీరు తాగడం, మద్యం సేవించకపోవడం చాలా అవసరం. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉంటే, మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. ఫ్యాటీ లివర్ నిర్ధారణ అయినట్లయితే, డాక్టర్ సూచనలను పాటించడం, వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.