
Kuldeep Yadav Wedding : టీమిండియా స్టార్ స్పిన్నర్, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో కలిసి ఈరోజు (మార్చి 14న) కుల్దీప్ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాడు. ప్రకృతి ఒడిలో అందమైన డెహ్రాడూన్ వేదికగా వీరి పెళ్లి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వేడుకలకు సంబంధించిన హల్దీ, సంగీత్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను అలరిస్తున్నాయి. కేవలం కుటుంబ సభ్యులే కాకుండా, భారత క్రికెట్ జట్టులోని కుల్దీప్ ప్రాణమిత్రులందరూ డెహ్రాడూన్‌కు చేరుకుని సందడి చేస్తున్నారు.
శుక్రవారం రాత్రి జరిగిన సంగీత్ వేడుకలో కుల్దీప్ యాదవ్, వంశిక జంట అదిరిపోయే స్టెప్పులతో స్టేజ్ పైన రచ్చ చేశారు. కేవలం ఈ జంట మాత్రమే కాదు, కుల్దీప్ బెస్ట్ ఫ్రెండ్ యుజువేంద్ర చాహల్ తన డాన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కుల్-చా జోడీగా మైదానంలో వికెట్లు తీసే ఈ స్నేహితులు, స్టేజ్ మీద కూడా డ్యాన్స్‌తో దుమ్ములేపారు. వీరితో పాటు రింకూ సింగ్ కూడా తనదైన శైలిలో చిందులేస్తూ వేడుకలో జోష్ నింపాడు. క్రికెటర్లందరూ బ్యాట్లు వదిలేసి ఇలా చిందులేయడం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
View this post on Instagram
మరోవైపు హల్దీ వేడుకలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. కుల్దీప్ యాదవ్, వంశికలకు పసుపు రాస్తున్న సమయంలో చాహల్ చేసిన పని అందరినీ నవ్వించింది. కుల్దీప్కు పసుపు పూసిన చాహల్, సరదాగా కుల్దీప్ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. మైదానంలోనే కాకుండా నిజ జీవితంలో కూడా వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంత గొప్పదో ఈ వీడియో మరోసారి చాటిచెప్పింది. ఈ వేడుకల్లో భువనేశ్వర్ కుమార్, పియూష్ చావ్లా, టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ కూడా పాల్గొని సందడి చేశారు.
మొత్తానికి ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే కుల్దీప్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నాడు. ఒకవైపు పెళ్లి సందడి, మరోవైపు త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ హంగామాతో క్రికెట్ ప్రపంచం ఊగిపోతోంది. ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, తోటి క్రికెటర్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. డెహ్రాడూన్ లోని ఒక రిసార్ట్‌లో జరిగే ఈ వివాహానికి మరికొంతమంది స్టార్ క్రికెటర్లు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..