
మోసం.. మోసం.. మోసం.. యాడ చూసినా మోసమే.. ఏ పని చేద్దామన్న మోసమే ఎదురవుతుంది. కన్నింగ్ గాళ్లు రోజుకో కంత్రీ ఐడియాతో చెలరేగిపోతున్నారు. మంచి చేస్తున్నట్లు నటిస్తూ కొందరు నిలువునా ముంచేస్తున్నారు. ఖమ్మం నగరంలో వెలుగుచూసిన ఈ
ఘటనే అందుకు ఉదాహరణ. కొణిజర్ల మండలానికి చెందిన 55 ఏళ్ల మహిళ ఖమ్మం నగరం బోసుబొమ్మ సెంటర్‌లో నివాసం ఉంటోంది. ఈ నెల 20న పాత బస్టాండు వైపునుంచి ఇంటికి నడిచి వెళ్తుండగా గాంధీచౌక్ వద్ద ఓ అపరిచిత మహిళ ఆమెను అనుసరించింది. ఆంధ్రాబ్యాంకు సమీపం వద్దకు రాగానే అపరిచిత మహిళ ఓ పొట్లాన్నిఈమె ముందు పడేసి తీసింది. తనకు బంగారం బిస్కెట్ దొరికిందని.. చెరిసగం
తీసుకుందామని చెప్పి నమ్మించింది.
అక్కడికి వచ్చిన మరో వ్యక్తి అది పది తులాలు ఉంటుందని రూ.10లక్షలకు పైగా విలువ ఉంటుందని నమ్మబలికాడు. బంగారం బిస్కట్టు తీసుకుని రూ. 5 లక్షలు తనకు ఇవ్వాలని ఆ మహిళను సదరు నిందితురాలు కోరింది. దీంతో అందతా నిజమే అని నమ్మిన ఆ మహిళ.. తన చేతిలోని రూ. 10వేల నగదు, మెడలోని సుమారు 2 తులాల బంగారపు గొలుసు ఇచ్చింది. మిగిలిన డబ్బు తీసుకువచ్చే వరకు తాను
కేశవరావు పార్కు వద్ద కూర్చుంటానని నిందితురాలు చెప్పడంతో ఆ మహిళ ఇంటికి వెళ్లింది. అనంతరం తనిఖీ చేయగా.. అది నకిలీ బంగారమని తెలుసుకుని మోసపోయినట్లు గుర్తించి నిందితులు కోసం గాలించింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు ..సదరు నిందితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని నిందితుల పోటోలు విడుదల చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.