Irfan Pathan : ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కొన్ని వివాదాస్పద సంఘటనలు చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్ ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్, హ్యారిస్ రవూఫ్ చూపించిన అగ్రెసివ్ సంజ్ఞలపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్రంగా స్పందించాడు. పహల్గామ్ దాడులు, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ సంబంధాలపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఎప్పుడూ స్పష్టంగా మాట్లాడతారు. ఆసియా కప్‌లో భారత్ రెండుసార్లు పాకిస్తాన్‌ను ఓడించడంతో మైదానంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ముఖ్యంగా భారత ఓపెనర్లు శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, పాకిస్తాన్ బౌలర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది.
తన యూట్యూబ్ ఛానెల్‌లో ఇర్ఫాన్ పఠాన్ ఈ పరిస్థితిపై స్పందిస్తూ.. “భారత్ గెలుస్తుంది, భారత్ ముందుకు వెళ్తుంది. ఇది భారత మ్యాజిక్. కానీ నిన్న మేము చాలా దూకుడు, చాలా మాటల యుద్ధం చూశాము. అభిషేక్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో కూడా వారు అనవసరమైన మాటలు అన్నారని చెప్పాడు. అందుకే మన ఆటగాళ్లందరూ సోషల్ మీడియాలో ‘మీరు మాట్లాడండి, మేము గెలుస్తూనే ఉంటాం’ అని ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు” అని పఠాన్ అన్నారు.
“భారత క్రికెటర్లు ఎప్పుడూ తొందరపడరు. మేము ఎప్పుడూ అనవసరమైన మాటలు అనం. మేము ప్రశాంతంగా మా ఆట మేం ఆడుకుంటాం. కానీ మీరు ఏదైనా చెబితే మేము సమాధానం చెప్పలేమని అనుకోవద్దు. మీరు ఆస్ట్రేలియా వాళ్లు అయినా, పాకిస్తాన్ వాళ్లు అయినా సరే. మేము సమాధానం ఇస్తాం. బ్యాట్‌తో సమాధానం ఇస్తాం, నోటితో కూడా ఇస్తాం” అని పఠాన్ ఘాటుగా హెచ్చరించాడు.
ఇర్ఫాన్ పఠాన్ ప్రకారం.. భారత అభిమానులు భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లు ఉన్నప్పుడు దానిని ఒక పోటీగా చూస్తారు. కానీ, పాకిస్తాన్ మాత్రం దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. భారత్‌తో మ్యాచ్ లేనప్పుడు కూడా ఇది అలాగే చేస్తుంది. దీనికి ఉదాహరణగా 2022 ప్రపంచ కప్‌లో జింబాబ్వేతో పాకిస్తాన్ ఓడినప్పుడు, భారత విశ్లేషకులు కేవలం విశ్లేషణ మాత్రమే చేశారని, అంతకుమించి ఎవరూ పట్టించుకోలేదని పఠాన్ చెప్పాడు.
“మేము పాకిస్తాన్ ఎలా ఓడిపోయింది, 2022 ప్రపంచ కప్‌లో జింబాబ్వే చేతిలో ఎలా ఓడిపోయిందనే విషయాలపై మీడియాలో కూడా మాట్లాడలేదు. నేను ట్వీట్ చేయలేదు, ఇంకెవరూ చేయలేదు. ఎందుకంటే మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు. మేము కేవలం విశ్లేషణ మాత్రమే చేస్తాం, అంతకుమించి మాకు పట్టదు” అని పఠాన్ అన్నారు.
అంతేకాకుండా, సాహిబ్‌జాదా ఫర్హాన్ గన్ సెలబ్రేషన్, హ్యారిస్ రవూఫ్ విమానాలను కూల్చే సంజ్ఞలను ప్రస్తావిస్తూ.. “మీరు మాతో పెట్టుకుంటే, మేము మిమ్మల్ని వదలం. ఇది మా రూల్. నిన్న మ్యాచ్‌లో ఏం జరిగిందో మీకు తెలుసు మన రెండు దేశాల మధ్య ఏం జరుగుతోందో, అయినా మీరు అలాంటి సెలబ్రేషన్లు చేస్తున్నారు” అని అన్నాడు.
“హ్యారిస్ రౌఫ్, నేను ఈ కుర్రాడు మంచివాడని అనుకున్నాను. ఆస్ట్రేలియాలో మేము మాట్లాడినప్పుడు అతను కృతజ్ఞతతో ఉన్నట్లు అనిపించింది. కానీ నిన్న అతను ప్రవర్తించిన తీరు అవసరం లేదు. ఈ ఇద్దరు కుర్రాళ్లు ప్రవర్తించిన తీరు వారి పెంపకం, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమి చేస్తారు అనే దాని గురించి చెబుతుంది” అని పఠాన్ తన మాటలు ముగించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..