టీ20 వరల్డ్ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంటుండగా, క్రికెట్ అభిమానుల దృష్టి ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) పై పడింది. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభమై మే 31 వరకు కొనసాగనుంది.
ఇప్పటికే టోర్నమెంట్ తేదీలు ఖరారవగా, ఇప్పుడు ప్రారంభ మ్యాచ్ ఎక్కడ జరగబోతుందో కూడా స్పష్టమైంది. తాజా సమాచారం ప్రకారం ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం (M. Chinnaswamy Stadium) లో జరగనుంది.
చిన్ని స్వామి స్టేడియంలో ప్రారంభ మ్యాచ్..
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా గత సీజన్ ఛాంపియన్ జట్టు హోమ్ గ్రౌండ్‌లోనే ఐపీఎల్ ప్రారంభమవుతుంది. గత ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) తమ చరిత్రలో తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.
అందుకే, ఈసారి ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభ మ్యాచ్ ఆ జట్టు హోమ్ గ్రౌండ్ అయిన ఎం. చిన్ని స్వామి స్టేడియంలో జరగనుంది. టోర్నమెంట్ ఫైనల్ కూడా అదే వేదికలో జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
గత ఘటన తర్వాత మళ్లీ మ్యాచ్‌లు..
గత సీజన్‌లో ఆర్సీబీ విజయం తర్వాత స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత బెంగళూరులో మ్యాచ్‌లు నిర్వహించడంపై తాత్కాలికంగా సందేహాలు ఏర్పడ్డాయి.
అయితే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (Karnataka State Cricket Association) కొత్త అధ్యక్షుడు, మాజీ భారత బౌలర్ వెంకటేష్ ప్రసాద్ (Venkatesh Prasad) స్టేడియంలో మళ్లీ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఐపీఎల్ తిరిగి బెంగళూరులో ప్రారంభం కానుంది.