IND vs SL : తండ్రిని కోల్పోయిన క్రికెటర్‎కు ఓదార్పు.. మ్యాచ్ తర్వాత భావోద్వేగ క్షణాలు.. క్రికెట్ స్ఫూర్తి చాటిన టీమిండియా కెప్టెన్

IND vs SL : తండ్రిని కోల్పోయిన క్రికెటర్‎కు ఓదార్పు.. మ్యాచ్ తర్వాత భావోద్వేగ క్షణాలు..  క్రికెట్ స్ఫూర్తి చాటిన టీమిండియా కెప్టెన్


IND vs SL : భారత్, శ్రీలంక మధ్య జరిగిన సూపర్-4 చివరి మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. సూపర్ ఓవర్‌లో టీమిండియా విజయం సాధించి, 2025 ఆసియా కప్‌లో అజేయంగా నిలిచింది. ఫైనల్‌లో భారత్ ఇప్పుడు పాకిస్తాన్‌తో తలపడనుంది. అయితే, ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ తర్వాత, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శ్రీలంక యువ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లాలగేను కలుసుకున్నాడు. అతడిని ఆప్యాయంగా కౌగిలించుకొని, ఇటీవల మరణించిన అతని తండ్రికి సంతాపం తెలిపాడు.

దునిత్ వెల్లాలగేకు ఊహించని విషాదం

శ్రీలంక ఆల్‌రౌండర్ దునిత్ వెల్లాలగే తండ్రి సెప్టెంబర్ 18న కన్నుమూశారు. ఆరోజు వెల్లాలగే ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతున్నాడు. మ్యాచ్ తర్వాత శ్రీలంక హెడ్ కోచ్ సనత్ జయసూర్య ఈ విషాద వార్తను వెల్లాలగేకు తెలియజేశారు. ఈ విషయం తెలిసి సూర్యకుమార్ యాదవ్, వెల్లాలగేను వ్యక్తిగతంగా కలుసుకుని ఓదార్చాడు. సూర్యకుమార్ వెల్లాలగేను ఆప్యాయంగా కౌగిలించుకొని, చాలాసేపు అతనితో మాట్లాడాడు. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతకు ముందు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా కూడా దునిత్ వెల్లాలగేను కలిసి అతని తండ్రి మృతికి సంతాపం తెలిపాడు. ఇది క్రికెట్ ఆటగాళ్ల మధ్య ఉన్న సోదరభావాన్ని, క్రీడా స్ఫూర్తిని చాటుతోంది.

వెల్లాలగే తండ్రి మరణానికి గల కారణం

శ్రీలంక ఆల్‌రౌండర్ దునిత్ వెల్లాలగే తండ్రి సెప్టెంబర్ 18 రాత్రి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గుండెపోటుతో మరణించారు. నివేదికల ప్రకారం, దునిత్ వెల్లాలగే ఆ మ్యాచ్‌లో సరిగా రాణించకపోవడం చూసి ఆయనకు గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది. అదే సమయంలో ఆయన కన్నుమూశారు.

ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో మహమ్మద్ నబీ, వెల్లాలగే బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టాడు. అయినప్పటికీ, ఆ మ్యాచ్‌ను శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలిచి, ఆఫ్ఘనిస్తాన్‌ను ఆసియా కప్ నుండి ఇంటికి పంపింది. తన వ్యక్తిగత విషాదాన్ని పక్కన పెట్టి, దేశం కోసం ఆడిన వెల్లాలగేకు క్రికెట్ ప్రపంచం అంతా మద్దతుగా నిలుస్తోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *