Sanju Samson 12th Player: వికెట్ కీపర్ కం బ్యాటర్ సంజూ శాంసన్ ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో హీరోగా నిలిచాడు. అయితే, ఆసియా కప్‌లో భాగంగా పాక్ తో జరగబోయే మ్యాచ్ లో భారత జట్టు తరపున 12వ ఆటగాడు కావొచ్చని తెలుస్తోంది. అయితే, టీమిండియా ప్లేయింగ్ XIలో మాత్రం కాదండోయ్. పాకిస్తాన్ తో జరిగే సూపర్ 4 మ్యాచ్ కోసం శాంసన్ ఖచ్చితంగా భారత ప్లేయింగ్ XI లో ఉంటాడు. ఇక్కడ, 12వ ఆటగాడిగా ఉండటం అంటే అతను టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో 1,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో చేరతాడన్నమాట. ఇప్పటివరకు, 11 మంది భారతీయ ఆటగాళ్లు ఆ జాబితాలో ఉన్నారు. సంజు శాంసన్ ఈ లిస్ట్ లో 12వ ఆటగాడిగా చేరే అవకాశం ఉంది.
టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ 4,231 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ తర్వాత 4,188 పరుగులతో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పుడు టీ20ఐల నుంచి రిటైర్ అయ్యారు.
ఇవి కూడా చదవండి
భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 2,652 పరుగులు చేసి జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 2,265 పరుగులు చేసి నాల్గవ స్థానంలో ఉన్నాడు. 11 మంది ఆటగాళ్ల జాబితాలో హార్దిక్ పాండ్యా 1,813 పరుగులతో ఐదవ స్థానంలో ఉన్నాడు. శిఖర్ ధావన్ 1,759 పరుగులు, ఎంఎస్ ధోని 1,617 పరుగులు సాధించాడు. సురేష్ రైనా 1,605 పరుగులతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. రిషబ్ పంత్ 1,209 పరుగులతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. యువరాజ్ సింగ్ (1,177 పరుగులు), శ్రేయాస్ అయ్యర్ (1,104 పరుగులు) వరుసగా 10వ, 11వ స్థానాల్లో ఉన్నారు.
12వ ఆటగాడిగా సంజు శాంసన్..
ఈ 11 మంది భారత ఆటగాళ్లలో సంజు శాంసన్ 12వ ఆటగాడిగా మారవచ్చు. అయితే, అతను మొదటి సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 83 పరుగులు చేయాల్సి ఉంటుంది. శాంసన్ 45 టీ20ల్లో 39 ఇన్నింగ్స్‌ల్లో 917 పరుగులు చేశాడు. పాకిస్తాన్‌తో జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్‌లో శాంసన్ ఈ ఘనతను సాధిస్తే అది గొప్ప విషయం. అయితే, అది జరగకపోయినా, 2025 ఆసియా కప్‌లో అతను దానిని సాధించే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..