IND vs PAK : ఆసియా కప్ 2025లో క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హై ఓల్టేజ్ మ్యాచ్ ఈరోజు జరగబోతోంది. భారత్ , పాకిస్తాన్ జట్లు సూపర్-4 దశలో మరోసారి తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ హై-వోల్టేజ్ డ్రామాతో కూడి ఉండనుంది. గత గ్రూప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుండగా, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా తమ విజయాల పరంపరను కొనసాగించాలని భావిస్తోంది.
ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ సెప్టెంబర్ 21, ఆదివారం, రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ రాత్రి 7:30 గంటలకు జరుగుతుంది. ఈ మ్యాచ్‌ను టీవీలో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెల్‌లలో చూడవచ్చు. అయితే, సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ లేనివారు కూడా ఈ మ్యాచ్‌ను ఉచితంగా చూసే అవకాశం ఉంది. దూరదర్శన్ కేవలం భారత మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేస్తుంది కాబట్టి, డీడీ స్పోర్ట్స్ ఛానెల్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. మొబైల్లో చూడాలనుకునేవారు సోనీ లివ్ యాప్ ద్వారా లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు, కానీ దీనికి సబ్స్క్రిప్షన్ అవసరం. ఇతర ప్లాట్‌ఫారమ్‌లైన జియో టీవీ, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్లలో కూడా సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో భారత జట్టులో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా ప్లేయింగ్-11లోకి తిరిగి రావడం దాదాపు ఖాయం. స్పిన్ విభాగాన్ని బలోపేతం చేయడానికి వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇవ్వవచ్చని భావిస్తున్నారు. గత రెండు మ్యాచ్‌లలో భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. బ్యాట్స్‌మెన్ కూడా బాధ్యతాయుతంగా పరుగులు చేశారు. గత మ్యాచ్‌లో జరిగిన హ్యాండ్‌షేక్ వివాదం తర్వాత ఈ మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో జరిగే ఈ సూపర్-4 మ్యాచ్ చాలా నాటకీయంగా ఉండనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..