IND vs NZ : టీమిండియాకు మూడు అగ్నిపరీక్షలు.. కివీస్ గండాన్ని దాటేసి హిస్టరీ క్రియేట్ చేస్తారా?

IND vs NZ : టీమిండియాకు మూడు అగ్నిపరీక్షలు.. కివీస్ గండాన్ని దాటేసి హిస్టరీ క్రియేట్ చేస్తారా?


IND vs NZ : టీమిండియాకు మూడు అగ్నిపరీక్షలు.. కివీస్ గండాన్ని దాటేసి హిస్టరీ క్రియేట్ చేస్తారా?

IND vs NZ : టీ20 క్రికెట్ చరిత్రలో గత 21 ఏళ్లలో ఏ జట్టుకూ సాధ్యం కాని అరుదైన రికార్డును అందుకోవడానికి టీమిండియా ఇప్పుడు అడుగు దూరంలో ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు మరోసారి పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలిచి, వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించాలని కసితో ఉంది. మార్చి 8, ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మహా సంగ్రామంలో కివీస్‌ను ఢీకొట్టేందుకు భారత్ సిద్ధమైంది. అయితే, ఈ చారిత్రాత్మక విజయానికి ముందు టీమిండియాను మూడు ప్రధాన సవాళ్లు భయపెడుతున్నాయి.

అహ్మదాబాద్ స్టేడియం.. తీరని చేదు జ్ఞాపకం

మొదటి సవాలు అహ్మదాబాద్ వేదిక. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఇదే స్టేడియంలో జరిగింది. అప్పటివరకు వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన భారత్, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి కోట్లాది మంది భారతీయుల గుండెలను ముక్కలు చేసింది. కేవలం అది మాత్రమే కాదు, గత రెండున్నరేళ్లలో ఐసీసీ టోర్నీల్లో భారత్ ఆడిన 32 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే ఓడింది. ఆశ్చర్యకరంగా ఆ రెండు ఓటములు (2023 ఫైనల్, ప్రస్తుత వరల్డ్ కప్ సూపర్-8లో సౌతాఫ్రికాతో మ్యాచ్) ఈ అహ్మదాబాద్ స్టేడియంలోనే వచ్చాయి. ఈ పిచ్‌పై టీమిండియా తన దురదృష్టాన్ని మార్చుకోవాల్సి ఉంది.

టీ20 వరల్డ్ కప్‌లో కివీస్ గండం

రెండో సవాలు ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్-న్యూజిలాండ్ జట్లు ఇప్పటివరకు మూడుసార్లు తలపడ్డాయి. ఆశ్చర్యకరంగా ఈ మూడు సార్లు కివీస్ జట్టునే విజయం వరించింది. 2007, 2016, 2021 టోర్నీల్లో భారత్‌ను కివీస్ ఓడించింది. ఐసీసీ టోర్నీల్లో భారత్‌కు న్యూజిలాండ్ ఎప్పుడూ ఒక పీడకల లాంటిదే. మరి నాలుగో ప్రయత్నంలోనైనా టీమిండియా ఈ కివీస్ గండాన్ని దాటేసి చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి.

ఆదివారం సెంటిమెంట్.. భయపెడుతున్న చరిత్ర

మూడోది, అత్యంత విచిత్రమైన సవాలు ఆదివారం. వినడానికి వింతగా ఉన్నా, ఇది టీమిండియాకు ఒక చేదు నిజం. ఇప్పటివరకు భారత్ గెలిచిన ప్రధాన ఐసీసీ ఫైనల్స్ అన్నీ శనివారమే జరిగాయి (1983, 2011, 2024). ఆదివారం జరిగిన 2000 నాకౌట్ ట్రోఫీ, 2003 వరల్డ్ కప్, 2014 టీ20 వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో భారత్ ఓడిపోయింది. ఒక్క 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మాత్రమే ఆదివారం రోజున భారత్ గెలిచింది, అది కూడా కివీస్‌పైనే రావడం ఇప్పుడు ఒక ఆశ రేకెత్తిస్తోంది.

చరిత్ర మారుతుందా?

ఈ మూడు సవాళ్లు ఒకవైపు ఉన్నా, ప్రస్తుత భారత జట్టు ఉన్న ఫామ్ చూస్తుంటే ఇవన్నీ చిన్నవిగానే కనిపిస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో యువ భారతం సరికొత్త చరిత్రను లిఖించడానికి సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా, కివీస్ జట్టుపై, ఆదివారం పూట విజయం సాధించి ఒకే దెబ్బకు మూడు సెంటిమెంట్లను బద్దలు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *