
టీమిండియా అండర్ 19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన తొలి ఆస్ట్రేలియా వైట్-బాల్ సిరీస్‌లో 124 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇంగ్లాండ్ పర్యటనలో తన ప్రతాపం చూపించిన వైభవ్.. ఇప్పుడుమరోసారి తన బ్యాట్‌తో రుచి చూపించాడు. ఆస్ట్రేలియాలో జరిగిన మూడు మ్యాచ్‌ల అండర్-19 వన్డే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ 110 బంతులు ఎదుర్కొని 41.33 సగటు, 112.72 స్ట్రైక్ రేట్‌తో కేవలం 124 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లలో అతడి బ్యాట్ నుంచి 9 సిక్సర్లు, 12 ఫోర్లు వచ్చాయి. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ అండర్-19 జట్టు సిరీస్ గెలుచుకుంది.
సెప్టెంబర్ 24న బ్రిస్బేన్‌లోని ఇయాన్ హీలీ ఓవల్‌లో జరిగిన రెండవ యూత్ వన్డేలో భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియా అండర్ 19 జట్టును 51 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టుకు వైభవ్ సూర్యవంశీ (68 బంతుల్లో 70), విహాన్ మల్హోత్రా (74 బంతుల్లో 70), అభిజ్ఞాన్ కుందు (64 బంతుల్లో 71) అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో 49.4 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌటైంది. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే(3/27, 4 ఓవర్లు) మూడు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. మరోవైపు కనిష్క్ చౌహాన్ పది ఓవర్లలో రెండు వికెట్లు (2/50) తీసుకున్నాడు.
ఆయుష్ మాత్రే రెండు బంతుల్లోనే డకౌట్ అయి పెవిలియన్‌కు చేరడంతో భారత్‌కు గొప్ప ఆరంభం లభించలేదు. ఆ తర్వాత విహాన్ మల్హోత్రా, వైభవ్ సూర్యవంశీతో కలిసి 111 బంతుల్లో రెండో వికెట్‌కు 117 పరుగులు జోడించారు. సూర్యవంశీ 54 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. తన మైలురాయిని చేరుకున్న తర్వాత గేర్ మార్చి.. మొత్తంగా 68 బంతుల్లో 70 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతడు అవుట్ అనంతరం విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుండు భారత్ 300 పరుగులు చేయడంలో సహాయపడ్డారు.