
హైదరాబాద్, సెప్టెంబర్ 26: హైదరాబాద్ నగరవ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. రోడ్డపై ఎక్కడికక్కడ భారిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటితో రహదారులు నీటమునిగిపోయాయి. తక్కువ ఎత్తులో ఉన్న కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం మరికొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్ సహా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, జనగాం, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. వర్షాల నేపథ్యంలో ఐటీ కారిడార్ పరిధిలో కంపెనీ ఎంప్లొయ్స్ కి వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు ఆయా కంపెనీలకు సూచించారు. ఇవ్వాళ, రేపు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఉద్యోగులకు WFH ఇవ్వాలని తెలిపారు.
సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిరంతరం పరిస్థితిని మానిటర్ చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలెర్ట్‌లో ఉండాలని ఆదేశం. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే తరలించాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అన్ని కాజ్ వేలను పరిశీలించాలని కోరారు.
రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిపివేయాలని, విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా కొనసాగించాలని సూచించారు. వేలాడే విద్యుత్ వైర్లు వెంటనే తొలగించాలని కోరారు. ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దసరా సెలవులున్నా విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే బయటికి రావాలని సూచించారు. ఈ క్రమంఓల హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం అయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.